Sanjeevani Project: గిరిజన ఆరోగ్యానికి భారీ ఊతం.. రూ.250 కోట్లతో మౌలిక వసతుల సంజీవని మిషన్!
Sanjeevani Project: మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యం మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైద్యం కోసం ప్రజలు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా, వైద్య సేవలే వారి వద్దకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యక్తిగత డిజిటల్ హెల్త్ రికార్డులతో ప్రతి కుటుంబ ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ‘సంజీవని’ ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు వెల్లడించారు.
మారుమూల గిరిజన ప్రాంతాలకు వైద్యం.. సంజీవనితో ఆరోగ్య విప్లవం: సీఎం చంద్రబాబు..
సంజీవనితో ప్రతి కుటుంబ ఆరోగ్యంపై పర్యవేక్షణ.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు..
అరకు: మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యం మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైద్యం కోసం ప్రజలు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా, వైద్య సేవలే వారి వద్దకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యక్తిగత డిజిటల్ హెల్త్ రికార్డులతో ప్రతి కుటుంబ ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ‘సంజీవని’ ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు వెల్లడించారు.
అరకు లోయ నియోజకవర్గంలోని గన్నెలిలో సంజీవని ప్రాజెక్టు అమలును సీఎం పరిశీలించారు. అనంతరం నిర్వహించిన ప్రజా వేదికలో ఆయన మాట్లాడారు. గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే నిజమైన అభివృద్ధికి కొలమానమని పేర్కొన్నారు.
రూ.250 కోట్లతో గిరిజన ఆరోగ్య మిషన్
గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు రూ.250 కోట్లతో ట్రైబల్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంప్లీషన్ మిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
సికిల్ సెల్, తలసేమియా బాధితులకు నెలకు రూ.10 వేల పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని మండలాల్లో తక్కువ ధరలకు మందులు అందించే జన ఔషధి కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. గిరిజనులకు ఆయుర్వేద వైద్యం అందించిన అల్లూరి సీతారామరాజును స్మరించుకునేలా కొత్త విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టామని చెప్పారు. గిరిజన యువత థింసా నృత్యంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం అభినందనీయమన్నారు.
యోగ, ధ్యానం వంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ప్రజారోగ్యంపై దృష్టి పెడుతున్నామని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంచేందుకు సెల్ టవర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
డ్రోన్లతో అత్యవసర వైద్య సేవలు
ఏజెన్సీ ప్రాంతాల నుంచి రోగుల రక్త నమూనాలను డ్రోన్ల ద్వారా పెద్ద ఆసుపత్రులకు తరలించి పరీక్షలు నిర్వహించే విధానాన్ని అమలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అవసరమైన మందులు, వ్యాక్సీన్లను కూడా వేగంగా చేరవేసేలా సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు.
గర్భిణుల కోసం తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు, 104 వాహనాల ద్వారా సంచార వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇంటి వద్దే 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందించే చర్యలు చేపట్టామని వివరించారు.
కుప్పం నియోజకవర్గం, చిత్తూరు జిల్లాలో ఇప్పటికే సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తున్నామని, ఇది రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని సీఎం అన్నారు. అత్యవసర వైద్య సేవల కోసం అల్లూరి జిల్లాలో 150 వాహనాలతో ఎమర్జెన్సీ లైఫ్‌లైన్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గిరిజన అభివృద్ధికి ఐదు సూత్రాలు
గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ఐదు సూత్రాలతో ప్రణాళికలు రూపొందించామని చంద్రబాబు చెప్పారు. ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా రూ.1,000 కోట్లతో 905 కిలోమీటర్ల రహదారులు నిర్మించామని తెలిపారు. 1.60 లక్షల ఇళ్లకు కుళాయి నీరు అందించడంతో పాటు సోలార్ రూఫ్‌టాప్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అరకు కాఫీ సాగును మరో లక్ష ఎకరాలకు విస్తరించేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
పర్యాటకాన్ని అభివృద్ధి చేసి హోమ్‌స్టేల ద్వారా గిరిజన కుటుంబాలకు అదనపు ఆదాయం కల్పించాలన్నారు. పరిశ్రమల్లో గిరిజన యువతకు ఉద్యోగాలు లభించేలా నైపుణ్య శిక్షణ అందిస్తామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో లక్ష మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు.
జీఓ నంబర్ 3కు ప్రత్యామ్నాయం
గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా తమ ప్రభుత్వం జీఓ నంబర్ 3ను తీసుకొచ్చిందని చంద్రబాబు అన్నారు. అయితే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల సుప్రీంకోర్టు దానిని రద్దు చేసిందని ఆరోపించారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయ విధానాన్ని త్వరలో తీసుకొస్తామని తెలిపారు.
గిరిజన విద్యార్థులు దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థల్లో చదవాలన్న ఉద్దేశంతో ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. ఐఐటీ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ అందిస్తున్నామని తెలిపారు.
గిరిజన రైతుల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లేలా ప్రభుత్వం సహకరిస్తుందని సీఎం వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో జనాభా నిర్వహణలో మంచి విధానాలు కనిపిస్తున్నాయని, పిల్లలే సంపద అన్న భావనను వారు పాటించడం అభినందనీయమన్నారు.
మెడ్‌టెక్ జోన్‌తో ప్రపంచ మార్కెట్‌కు ఉత్పత్తులు
2014లో విశాఖ జిల్లాలో ఏర్పాటు చేసిన మెడ్‌టెక్ జోన్ ఇప్పుడు ప్రపంచ స్థాయి వైద్య పరికరాలను తయారు చేస్తోందని చంద్రబాబు తెలిపారు. కరోనా సమయంలో ఈ జోన్ నుంచి పెద్దఎత్తున వైద్య పరికరాలు అందించామని చెప్పారు.
భవిష్యత్‌లో మెడ్‌టెక్ జోన్ ఉత్పత్తులను అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ద్వారా ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశం ఉందన్నారు. అలాగే సెప్టెంబర్ 2న పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి నీటిని అనకాపల్లికి తీసుకెళ్లనున్నట్లు సీఎం తెలిపారు.
గత పాలనపై చంద్రబాబు విమర్శలు
గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి వ్యవస్థలను అస్తవ్యస్తం చేశారని చంద్రబాబు విమర్శించారు. జే బ్రాండ్లు, కల్తీ మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతిందని ఆరోపించారు. జే బ్రాండ్లను రద్దు చేసి మద్యం విధానాన్ని ప్రక్షాళన చేశామని చెప్పారు.
గతంలో గంజాయి కారణంగా ఏజెన్సీ ప్రాంతానికి చెడ్డపేరు వచ్చిందని, ఇప్పుడు కాఫీ, మిరియాలు వంటి ప్రత్యామ్నాయ పంటల ద్వారా గిరిజనులకు ఆదాయ మార్గాలు కల్పిస్తున్నామని తెలిపారు.
గ్రూప్-1 పరీక్షల్లో గత పాలకులు అవకతవకలకు పాల్పడ్డారని సీఎం ఆరోపించారు. ఆర్డీవో స్థాయి అధికారులను ఎంపిక చేసే పరీక్ష పత్రాలను ఎలక్ట్రీషియన్, అటెండర్‌తో దిద్దించారని విమర్శించారు. దీనివల్ల పరీక్షలు రాసిన అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారని అన్నారు.
బలవంతపు మత మార్పిడులపై ఆరోపణలు
గత పాలనలో దేవాలయాల ప్రతిష్ఠ దెబ్బతిందని, మత మార్పిడులకు ప్రయత్నాలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. ఓ మాజీ మంత్రి కోడలు ఇంట్లో జరిగిన ఘటనలను వెల్లడించారని, బలవంతపు మత మార్పిడికి ప్రయత్నించారని ఆమె చెప్పినట్లు సీఎం పేర్కొన్నారు.
మత విశ్వాసాలను ఎవరూ తప్పుపట్టరని, అయితే బలవంతంగా మతం మార్చడం మాత్రం సరికాదని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో దేవాలయాలపై దాడులు జరిగాయని, వాటి పవిత్రతకు భంగం కలిగిందని విమర్శించారు. ఆ పార్టీతో కలిసి పనిచేసిన కొంతమంది ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, అధికారులు జైలు పాలయ్యారని సీఎం అన్నారు.
ఏకగ్రీవాలపై వైఖరి మారిందంటూ విమర్శ
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ ప్రతిపక్ష నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. గతంలో ఏకగ్రీవ ఎన్నికలను సమర్థించి, ఇప్పుడు ఏకగ్రీవాలు జరగకూడదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఆరోగ్యం, విద్య, రహదారులు, ఉపాధి, తాగునీరు వంటి అంశాలకు సమగ్ర ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, గుమ్మిడి సంధ్యారాణితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Be the first to react