Double-Yolk Eggs: డబుల్ యోక్ ఎగ్‌ ఎందుకు వస్తుంది? రెండు పచ్చసొనల వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే!

Double-Yolk Eggs: గుడ్డు పగలగొట్టగానే రెండు పచ్చసొనలు కనిపిస్తే చాలామందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కొందరు దాన్ని అరుదైన విషయంగా భావిస్తారు. మరికొందరికి ఆ గుడ్డు తినడం సురక్షితమేనా అనే సందేహం వస్తుంది. అయితే రెండు పచ్చసొనలు ఉన్న గుడ్డు వెనుక ఎలాంటి మిస్టరీ లేదు. ఇది కోడి పునరుత్పత్తి వ్యవస్థలో జరిగే సహజ ప్రక్రియలో భాగమేనని నిపుణులు చెబుతున్నారు.

Double Yolk Eggs
Double Yolk Eggs

డబుల్ యోక్ ఎగ్స్ ఎందుకు ఏర్పడతాయి? కారణాలు, పోషకాలు, ఆసక్తికర విషయాలు ఇవే..

రెండు పచ్చసొనలు ఉన్న గుడ్లు తినొచ్చా? ఆరోగ్యంపై నిపుణుల వివరణ..

గుడ్డు పగలగొట్టగానే రెండు పచ్చసొనలు కనిపిస్తే చాలామందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కొందరు దాన్ని అరుదైన విషయంగా భావిస్తారు. మరికొందరికి ఆ గుడ్డు తినడం సురక్షితమేనా అనే సందేహం వస్తుంది. అయితే రెండు పచ్చసొనలు ఉన్న గుడ్డు వెనుక ఎలాంటి మిస్టరీ లేదు. ఇది కోడి పునరుత్పత్తి వ్యవస్థలో జరిగే సహజ ప్రక్రియలో భాగమేనని నిపుణులు చెబుతున్నారు.

గుడ్డులో రెండు పచ్చసొనలు ఎలా వస్తాయి?
కోడి అండాశయం నుంచి సాధారణంగా ఒక పచ్చసొన ఒకసారి విడుదలవుతుంది. పచ్చసొన మొదట అండాశయంలో అపరిపక్వ అండకణంగా ఉంటుంది. అది క్రమంగా పెరుగుతూ పోషక పదార్థాల పొరలు చేరడంతో పసుపు రంగులో ఉండే పచ్చసొనగా మారుతుంది.

పచ్చసొన పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత ఓవ్యులేషన్‌ (అండోత్సర్గం) ప్రక్రియలో అండాశయం నుంచి బయటకు వస్తుంది. అనంతరం అది అండవాహికలోకి చేరుతుంది. అక్కడ దాని చుట్టూ గుడ్డులోని తెల్లసొన, పొరలు, చివరకు పెంకు ఏర్పడతాయి.

సాధారణంగా ఒక గుడ్డు పెట్టిన సుమారు 30 నిమిషాల తర్వాత మరో పచ్చసొన అండవాహికలోకి ప్రవేశిస్తుంది. అయితే అరుదైన సందర్భాల్లో రెండు పచ్చసొనలు చాలా తక్కువ వ్యవధిలోనే విడుదలవుతాయి. రెండూ కలిసి అండవాహికలో ప్రయాణిస్తాయి. కోడి శరీరం వాటి చుట్టూ గుడ్డులోని తెల్లసొన, ఇతర పొరలను ఏర్పరచి చివరికి ఒకే పెంకుతో కప్పుతుంది. అలా డబుల్ యోక్ ఎగ్‌ ఏర్పడుతుంది.

చిన్న వయసు కోళ్లలో ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంది?
డబుల్ యోక్ గుడ్లు రావడానికి కోడి వయసు ముఖ్యమైన కారణాల్లో ఒకటని నిపుణులు చెబుతున్నారు. గుడ్లు పెట్టడం మొదలుపెట్టిన చిన్న వయసు కోళ్లలో పునరుత్పత్తి చక్రం ఇంకా పూర్తిగా క్రమబద్ధంగా ఉండకపోవచ్చు. దీంతో అండాశయం నుంచి రెండు పచ్చసొనలు తక్కువ వ్యవధిలో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే గుడ్లు పెట్టడం ప్రారంభించిన యువ కోళ్లలో డబుల్ యోక్ గుడ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని పుల్లెట్ లు (Pullets) అని పిలుస్తారు.

జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయి
కోడి వయసుతో పాటు జన్యుపరమైన లక్షణాలు కూడా డబుల్ యోక్ గుడ్లకు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని కోళ్లలో సహజంగానే రెండు పచ్చసొనలు ఉన్న గుడ్లు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని జాతుల్లో లేదా ప్రత్యేకమైన కోళ్లలో ఈ లక్షణం తరచుగా కనిపించవచ్చు. అలాగే కోడి గుడ్లు పెట్టే చక్రంలో మార్పులు వచ్చినా డబుల్ యోక్ గుడ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.

ఒక గుడ్డులో తొమ్మిది పచ్చసొనలు
డబుల్ యోక్ గుడ్డు అరుదుగా కనిపిస్తే.. ఒకే గుడ్డులో తొమ్మిది పచ్చసొనలు ఉంటే ఇంకెంత ఆశ్చర్యం! గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన హైన్స్‌వర్త్ పౌల్ట్రీ ఫార్మ్స్‌కు చెందిన డయాన్ హైన్స్‌వర్త్ 1971లో తొమ్మిది పచ్చసొనలు ఉన్న గుడ్డును గుర్తించినట్లు నమోదు చేశారు. ఒక గుడ్డులో అత్యధికంగా నమోదైన పచ్చసొనల సంఖ్య ఇదే.

పచ్చసొన లేని గుడ్లు కూడా ఉంటాయి
రెండు పచ్చసొనలు ఉన్న గుడ్లకు పూర్తి భిన్నంగా డ్వార్ఫ్ లేదా ఫెయిరీ ఎగ్స్‌ అని పిలిచే గుడ్లు కూడా ఉంటాయి. వీటిలో అసలు పచ్చసొన ఉండదు. గుడ్లు పెట్టే ప్రక్రియను మొదటిసారి ప్రారంభించే చిన్న వయసు కోళ్లు ఇలాంటి గుడ్లను పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా సహజమైన ప్రక్రియలో భాగమే.

డబుల్ యోక్ గుడ్లు తినవచ్చా?
అవును. సాధారణంగా డబుల్ యోక్ గుడ్లు తినడానికి సురక్షితమే. రెండు పచ్చసొనలు ఉండటం వల్ల ఆ గుడ్డు చెడిపోయిందని లేదా ప్రమాదకరమని భావించాల్సిన అవసరం లేదు.

స్క్రాంబుల్డ్ ఎగ్స్‌, ఆమ్లెట్లు వంటి వంటకాల్లో వీటిని ఉపయోగించవచ్చు. ఉడికించినప్పుడు కూడా రెండు పచ్చసొనలు ప్రత్యేకంగా కనిపిస్తూ ఆకర్షణీయంగా ఉంటాయి. అదనపు పచ్చసొన కారణంగా ఆమ్లెట్ లేదా స్క్రాంబుల్డ్ ఎగ్స్‌కు మరింత బంగారు రంగు వస్తుంది. అయితే ఇతర గుడ్ల మాదిరిగానే తాజాదనం, నిల్వ, వంటలో పరిశుభ్రత వంటి సాధారణ ఆహార భద్రతా జాగ్రత్తలు పాటించడం అవసరం.

పోషకాలు కూడా ఎక్కువేనా? 
ఒక డబుల్ యోక్ గుడ్డులో రెండు పచ్చసొనలు ఉంటాయి కాబట్టి, సాధారణ గుడ్డుతో పోలిస్తే పచ్చసొనకు సంబంధించిన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పచ్చసొనలో ప్రోటీన్‌, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు ఉంటాయి. రెండు పచ్చసొనలు ఉండటంతో వీటి పరిమాణం కూడా సహజంగానే పెరగవచ్చు. అయితే ఖచ్చితమైన పోషక విలువ గుడ్డు పరిమాణం, రెండు పచ్చసొనల పరిమాణం వంటి అంశాలపై ఆధారపడి మారుతుంది.

ప్రకృతి చేసే చిన్న అద్భుతం
గుడ్డు పగలగొట్టినప్పుడు కనిపించే రెండు పచ్చసొనలు నిజానికి కోడి శరీరంలో జరిగిన ఒక చిన్న సహజ మార్పు ఫలితం. కోడి పునరుత్పత్తి చక్రం, వయసు, జన్యుపరమైన లక్షణాలు, గుడ్లు పెట్టే చక్రంలో మార్పులు.. ఇవన్నీ కలిసి అరుదుగా ఇలాంటి గుడ్డును ఏర్పరుస్తాయి. అందుకే డబుల్ యోక్ గుడ్డు కనిపిస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అది ప్రకృతి చూపించే మరో ఆసక్తికరమైన జీవశాస్త్ర ప్రక్రియ మాత్రమే.

Tags

Be the first to react

Latest