Air India: అంతర్జాతీయ లే ఓవర్లలో సిబ్బందికి లాండ్రీ సేవలు నిలిపివేయనున్న ఎయిర్ ఇండియా!
Air India: నష్టాల్లో కొనసాగుతున్న ఎయిర్ ఇండియా ఖర్చులను తగ్గించే చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అంతర్జాతీయ లే ఓవర్ల సమయంలో పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి అందించే సాధారణ లాండ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం జూలై 1, 2026 నుంచి అమల్లోకి రానుంది.
ఖర్చుల తగ్గింపు చర్యల్లో భాగంగా కీలక నిర్ణయం.. జూలై 1 నుంచి అమలు..
విదేశీ ప్రయాణాల్లో ఇక యూనిఫామ్ బాధ్యత సిబ్బందిదే.. లాండ్రీ సేవలు రద్దు చేసిన ఎయిర్ ఇండియా..
న్యూఢిల్లీ: నష్టాల్లో కొనసాగుతున్న ఎయిర్ ఇండియా ఖర్చులను తగ్గించే చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అంతర్జాతీయ లే ఓవర్ల సమయంలో పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి అందించే సాధారణ లాండ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం జూలై 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. అయితే దేశీయ లే ఓవర్లలో మాత్రం లాండ్రీ సౌకర్యం కొనసాగుతుంది.
ఎయిర్ ఇండియా సిబ్బంది అంతర్జాతీయ ప్రయాణాల్లో వివిధ దేశాల్లోని హోటళ్లలో బస చేసే సమయంలో తమ యూనిఫామ్లను లాండ్రీకి ఇస్తుంటారు. తద్వారా తదుపరి విమాన సర్వీస్కు వారు శుభ్రమైన, ఇస్త్రీ చేసిన యూనిఫామ్తో విధులకు హాజరవుతారు. విమానాశ్రయాల్లో సంస్థకు ప్రతినిధులుగా కనిపించే సిబ్బంది నిర్వహణకు ఇది ముఖ్యమైన అంశంగా భావిస్తారు.
అయితే గత ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా గ్రూప్కు వేల కోట్ల రూపాయల నష్టం రావడంతో అన్ని ఖర్చులను సమీక్షిస్తున్న సంస్థ, ఈ లాండ్రీ సదుపాయాన్ని కూడా నిలిపివేయాలని నిర్ణయించింది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ సిబ్బందికి పంపిన సందేశంలో ఎయిర్ ఇండియా యాజమాన్యం, “ఇది చాలా కాలంగా కొనసాగుతున్న సౌకర్యంలో మార్పు. సిబ్బందికి కొంత ఇబ్బంది కలిగించవచ్చని అర్థం చేసుకుంటున్నాం. అందుకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలి” అని పేర్కొంది.
సిబ్బంది ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని లే ఓవర్ హోటళ్లలో గదులకు ఇస్త్రీ పెట్టె, ఇస్త్రీ బోర్డు ఏర్పాటు చేస్తామని సంస్థ తెలిపింది. అదనపు యూనిఫామ్ అవసరం ఉన్న సిబ్బంది ప్రత్యేకంగా అభ్యర్థన చేసుకోవచ్చని సూచించింది.
అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం మినహాయింపు ఇచ్చింది. విమానాల దారి మళ్లింపులు (ఫ్లైట్ డైవర్షన్స్), విదేశాల్లో సిమ్యులేటర్ శిక్షణ లేదా క్లాస్రూమ్ ట్రైనింగ్కు సంబంధించిన విధుల్లో ఉన్నప్పుడు లాండ్రీ సౌకర్యం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ నిర్ణయంపై పలువురు పైలట్లు, క్యాబిన్ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సిబ్బంది ఇకపై అంతర్జాతీయ ప్రయాణాలకు వెళ్లేటప్పుడు బకెట్, డిటర్జెంట్, బట్టలు ఆరేసుకునే తీగ తీసుకెళ్లాల్సి వస్తుందా అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.
ఒక పైలట్ స్పందిస్తూ, ఈ నిర్ణయం గత ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ చెప్పిన ఎమిరేట్స్, ఎతిహాద్, ఖతార్ ఎయిర్వేస్ వంటి ప్రపంచ స్థాయి విమాన సంస్థలతో పోటీ పడాలన్న లక్ష్యానికి విరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు.
“ఎయిర్లైన్ను నడిపించే వారు నిజంగా ఏ అంశాల్లో సమస్యలు ఉన్నాయో గుర్తించాలి. అంతర్జాతీయ లాండ్రీ సేవలు నిలిపివేయడం వంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎయిర్ ఇండియా ప్రపంచ స్థాయి సంస్థగా మారదు” అని ఓ సీనియర్ సిబ్బంది వ్యాఖ్యానించారు. ఖర్చుల నియంత్రణ అవసరమే అయినప్పటికీ, ఇలాంటి నిర్ణయాలు సంస్థ ప్రతిష్టపై ప్రభావం చూపుతాయా అనే చర్చ ఎయిర్ ఇండియాలో కొనసాగుతోంది.