Road Trips: భారతదేశంలోని అత్యంత సవాలుతో కూడిన రోడ్ ట్రిప్స్ ఇవే.. అందంతో పాటు అప్రమత్తత కూడా అవసరం!
Road Trips: రోడ్ ట్రిప్ అంటే చాలామందికి స్వేచ్ఛ, ప్రకృతి అందాలు, ఇష్టమైన పాటలతో సాగే ఆనంద ప్రయాణం గుర్తుకు వస్తుంది. కానీ భారతదేశంలోని కొన్ని రహదారులు మాత్రం కేవలం ఉత్సాహంతో పూర్తిచేయలేనివి. ఎత్తైన పర్వత మార్గాలు, ఇరుకైన రోడ్లు, అకస్మాత్తుగా మారే వాతావరణ పరిస్థితులు ఈ ప్రయాణాలను మరింత సవాలుగా మారుస్తాయి.
పర్వత మార్గాలు, మారుతున్న వాతావరణం మధ్య సాగే ఈ ప్రయాణాలు సాహస ప్రియులకు ప్రత్యేక అనుభవం..
హిమాలయాల మధ్య సాహస ప్రయాణం.. డ్రైవర్లకు పరీక్షగా నిలిచే రోడ్లు..
న్యూఢిల్లీ: రోడ్ ట్రిప్ అంటే చాలామందికి స్వేచ్ఛ, ప్రకృతి అందాలు, ఇష్టమైన పాటలతో సాగే ఆనంద ప్రయాణం గుర్తుకు వస్తుంది. కానీ భారతదేశంలోని కొన్ని రహదారులు మాత్రం కేవలం ఉత్సాహంతో పూర్తిచేయలేనివి. ఎత్తైన పర్వత మార్గాలు, ఇరుకైన రోడ్లు, అకస్మాత్తుగా మారే వాతావరణ పరిస్థితులు ఈ ప్రయాణాలను మరింత సవాలుగా మారుస్తాయి. ఈ మార్గాల్లో అందమైన దృశ్యాలతో పాటు డ్రైవింగ్ అనుభవం, జాగ్రత్త, సరైన ప్రణాళిక కూడా ఎంతో అవసరం.
మనాలి–లేహ్ హైవే.. హిమాలయాల మధ్య సాహస ప్రయాణం
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన రోడ్ ట్రిప్స్‌లో మనాలి–లేహ్ హైవే ఒకటి. మంచుతో కప్పుకున్న పర్వతాలు, ఖాళీగా కనిపించే లోయలు, ఎత్తైన పర్వత ఎడారులు ఈ మార్గాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి.
అయితే ఈ అందాల వెనుక కఠినమైన ప్రయాణం కూడా ఉంటుంది. ఈ మార్గంలో గుంతలు, కఠినమైన రోడ్డు పరిస్థితులు, మంచు కరుగుదల వల్ల ఏర్పడే నీటి ప్రవాహాలు ఉంటాయి, ఎక్కువ దూరం వరకు పెట్రోల్ బంకులు ఉండవు, ఇతర సదుపాయాల కొరత ఉంటుంది మరియు ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి.
పర్వత ప్రాంతాల్లో వాతావరణం ఎప్పుడు మారుతుందో చెప్పలేం. ఒక క్షణం ఎండగా ఉన్నా, వెంటనే కష్టమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది.
శ్రీనగర్–లేహ్ రోడ్.. ప్రకృతి అందాల మధ్య జాగ్రత్త ప్రయాణం
శ్రీనగర్–లేహ్ రహదారి ఉత్తర భారతదేశంలోని అందమైన మార్గాల్లో ఒకటి. లోయలు, పర్వతాలు, ప్రకృతి దృశ్యాలు ప్రయాణికులను ఆకట్టుకుంటాయి.
అయితే ఈ మార్గంలో ఉన్న జోజిలా పాస్ ప్రధాన సవాల్‌గా ఉంటుంది. ఇరుకైన రోడ్లు, ఎత్తైన కొండ ప్రాంతాలు, రాళ్లతో కూడిన మార్గాలు డ్రైవర్లకు పరీక్షగా మారుతాయి. అదనంగా వాతావరణ మార్పులు, కొండచరియలు విరిగిపడే పరిస్థితులు కూడా ప్రయాణాన్ని ప్రభావితం చేయవచ్చు.
కిన్నౌర్–స్పితి మార్గం.. కొండ అంచులపై సాగే ప్రయాణం
కిన్నౌర్–స్పితి రోడ్ ట్రిప్ దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన ప్రయాణాల్లో ఒకటి. దూరంగా కనిపించే గ్రామాలు, భారీ రాళ్ల మధ్య నుంచి సాగే రోడ్లు ఈ మార్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి.
కిన్నౌర్ ప్రాంతంలో కొన్ని చోట్ల రహదారులు చాలా ఇరుకుగా ఉంటాయి. ఒకవైపు భారీ కొండలు, మరోవైపు లోయలు ఉండటంతో డ్రైవర్లు ఎంతో జాగ్రత్తగా ప్రయాణించాల్సి ఉంటుంది.
జులుక్ రూట్.. మలుపుల మధ్య మరిచిపోలేని అనుభవం
తూర్పు హిమాలయాల్లోని జులుక్ మార్గం తన ప్రత్యేకమైన మలుపులకు ప్రసిద్ధి చెందింది. వరుసగా వచ్చే హెయిర్‌పిన్ బెండ్లు, కొండలపై నుంచి కనిపించే అద్భుతమైన దృశ్యాలు ప్రయాణికులను ఆకట్టుకుంటాయి.
అయితే ఈ మార్గంలో వరుస మలుపులు, పొగమంచు, మంచు కారణంగా తగ్గే విజిబిలిటీ, అకస్మాత్తుగా మారే వాతావరణం, డ్రైవర్లకు సవాల్‌గా నిలుస్తాయి. కొండ రోడ్లపై అనుభవం లేని వారికి ఈ ప్రయాణం మానసికంగా కూడా అలసట కలిగించే అవకాశం ఉంటుంది.
సచ్ పాస్ రూట్.. సాహసికులకు నిజమైన పరీక్ష
చంబా, పాంగి వ్యాలీ మధ్య ఉన్న సచ్ పాస్ మార్గం రోడ్ ట్రిప్ ప్రియులకు ఎంతో ఆసక్తికరమైనదిగా ఉంటుంది. అయితే ఇది ప్రారంభం నుంచి చివరి వరకు కఠినమైన ప్రయాణమే.
ఈ మార్గంలో స్టీప్ రోడ్డు లు, ఇరుకైన కొండ రోడ్లు, మట్టి రోడ్లు, భారీ వర్షాలతో దెబ్బతినే మార్గాలు, మారుతూ ఉండే వాతావరణం వంటి పలు సవాళ్ళు ఎదురవుతాయి. ఇతర హైవేల మాదిరిగా పూర్తిస్థాయి సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణానికి ముందస్తు ప్రణాళిక అవసరం.
భారతదేశంలోని ఈ రోడ్ ట్రిప్స్ ప్రకృతి అందాలను దగ్గరగా చూసే అవకాశం ఇస్తాయి. కానీ ఈ ప్రయాణాలు కేవలం సరదా కోసం చేసే ట్రిప్స్ కాదు. సరైన వాహనం, అనుభవజ్ఞుడైన డ్రైవర్, వాతావరణ సమాచారం, అవసరమైన సామగ్రితో వెళ్లడం చాలా ముఖ్యం. ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే దానిని గౌరవిస్తూ, జాగ్రత్తగా ప్రయాణించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
Be the first to react