Nara Lokesh: 99 శాతం సులువైన అధికారుల పని.. లోకేశ్ కీలక ఆదేశాలు! బడి మానేసిన పిల్లలపై..
Nara Lokesh: కేవలం ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే, ఒక అభ్యర్థికి సంబంధించిన అన్ని రకాల విద్య, క్రీడా సర్టిఫికెట్లు డిజిటల్‌గా వెరిఫై అయ్యే పారదర్శకమైన, పటిష్ఠమైన వ్యవస్థను తక్షణమే ఏర్పాటు చేయాలని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు.
- కుల, ఆదాయ ధృవపత్రాల జారీ ప్రక్రియ మరింత సులభతరం..
- Politics: ఆర్టీజీఎస్ సేవలపై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష..
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సేవల సరళీకరణ, పారదర్శకత దిశగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. కేవలం అభ్యర్థి ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే, అతనికి లేదా ఆమెకు సంబంధించిన అన్ని రకాల విద్య, క్రీడా సర్టిఫికెట్లు డిజిటల్‌గా వెరిఫై అయ్యే అత్యంత పారదర్శకమైన, పటిష్ఠమైన వ్యవస్థను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనివల్ల ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ సులభతరం అవ్వడమే కాకుండా, రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే వేలాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో లక్షలాది మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఇబ్బందులు తప్పుతాయని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థి ఆధార్ నంబర్ కొట్టగానే, ఆయా సర్టిఫికెట్లను ఏ విద్యా సంస్థ లేదా బోర్డు, ఎప్పుడు, ఏ అధికారి జారీ చేశారనే పూర్తి వివరాలు రియల్ టైమ్‌లో స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యేలా 'డిజి వెరిఫై' (Digi Verify) వ్యవస్థను అత్యంత అధునాతన సాంకేతికతతో తీర్చిదిద్దాలని సూచించారు. ఈ వినూత్న వ్యవస్థ అందుబాటులోకి వస్తే సర్టిఫికెట్ల నకిలీల దందాకు అడ్డుకట్ట పడటంతో పాటు అధికారుల పనిభారం 99 శాతం వరకు సులభతరం అవుతుందని మంత్రి లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ మేరకు శుక్రవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ (RTGS) కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రి నారా లోకేశ్ ఐటీ, విద్యాశాఖల ఉన్నతాధికారులతో ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కీలక సమావేశంలో ఆర్టీజీఎస్ యొక్క భవిష్యత్తు లక్ష్యాలు, ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని ఆ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల సమాచారాన్ని (డేటాను) ఒకేచోట క్రోడీకరించి భద్రపరిచే ప్రతిష్టాత్మక 'డేటా లేక్' (Data Lake) మౌలిక వసతుల పనులను రాబోయే జులై మాసం నాటికి వంద శాతం పూర్తి చేయాలని గడువు విధించారు.
ఈ డేటా ఆధారిత పాలన ద్వారా ప్రజలకు క్షేత్రస్థాయిలో మేలు జరగాలని, ముఖ్యంగా విద్యాశాఖలో పాఠశాలల మధ్యలోనే చదువు ఆపేస్తున్న డ్రాప్ అవుట్ల (బడి మానేసిన పిల్లల) సంఖ్యను ఈ డేటా లేక్ సాంకేతికత ద్వారా నిశితంగా విశ్లేషించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఏయే ప్రాంతాల్లో, ఏయే కారణాల వల్ల విద్యార్థులు బడికి దూరం అవుతున్నారో గుర్తించి, వారిని తిరిగి బడికి రప్పించేందుకు అవసరమైన మార్గాలను అన్వేషించాలని సూచించారు. దీనితో పాటు ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆరోగ్య కార్యక్రమమైన 'సంజీవని'ని కూడా ఈ డేటా లేక్‌తో అనుసంధానించడం ద్వారా ప్రజల ఆరోగ్య ప్రొఫైల్‌ను పర్యవేక్షించడం సులభతరం అవుతుందని మంత్రి లోకేశ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రజా సేవలు మరింత చేరువ కావాలి..
ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించేందుకు 'మనమిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై నెలరోజుల పాటు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని లోకేష్ ఆదేశించారు. ఈ సేవలను ఎలా వినియోగించుకోవాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు. అదేవిధంగా కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో ఉన్న అడ్డంకులను తొలగించాలని, రేషన్ కార్డుల విభజన, పేర్ల చేర్పులు, తొలగింపుల ప్రక్రియను మరింత సరళతరం చేయాలని స్పష్టం చేశారు.
ఎల్‌నినో, విద్యుత్ డిమాండ్‌పై అప్రమత్తత..
రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జలవనరులు, వ్యవసాయ శాఖలతో పాటు ఇతర విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. నీటి వృథాను అరికట్టి, తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. జలాశయాల్లో నీటి లభ్యత, భూగర్భజలాల స్థాయిని ఆర్టీజీఎస్‌లోని 'అవేర్' విభాగం ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, ముఖ్యంగా రాయలసీమలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
వర్షాభావ పరిస్థితుల వల్ల జల విద్యుత్ ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నందున, విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.