హైదరాబాద్‌లో KFC, డొమినోస్‌కు షాక్.. 9 అవుట్‌లెట్ల లైసెన్సులు సస్పెండ్!
Food Safety Crackdown in Hyderabad: హైదరాబాద్‌లో ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ సంస్థలైన కేఎఫ్‌సీ (KFC), డొమినోస్ పిజ్జా (Domino’s Pizza) అవుట్‌లెట్లలో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. తనిఖీల్లో బొద్దింకలు, ఈగలు, ఎలుకల వ్యర్థాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రమైన వంటగదులు బయటపడటంతో తెలంగాణ ఆహార భద్రతా విభాగం కఠిన చర్యలు చేపట్టింది. నగరంలోని కేఎఫ్‌సీకి చెందిన ఏడు, డొమినోస్‌కు చెందిన రెండు అవుట్‌లెట్ల ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లైసెన్సులను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. వెంటనే కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించింది.
KFC, డొమినోస్‌లో బొద్దింకలు, ఎలుకల వ్యర్థాలు.. 9 ఫుడ్ అవుట్‌లెట్లపై వేటు..
KFC, డొమినోస్ వంటగదుల్లో అపరిశుభ్రత.. స్విగ్గీ, జొమాటో నుంచి తొలగింపునకు చర్యలు..
హైదరాబాద్‌లో ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ సంస్థలైన కేఎఫ్‌సీ (KFC), డొమినోస్ పిజ్జా (Domino’s Pizza) అవుట్‌లెట్లలో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. తనిఖీల్లో బొద్దింకలు, ఈగలు, ఎలుకల వ్యర్థాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రమైన వంటగదులు బయటపడటంతో తెలంగాణ ఆహార భద్రతా విభాగం కఠిన చర్యలు చేపట్టింది. నగరంలోని కేఎఫ్‌సీకి చెందిన ఏడు, డొమినోస్‌కు చెందిన రెండు అవుట్‌లెట్ల ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లైసెన్సులను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. వెంటనే కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించింది.
నవంబర్ 12న హైదరాబాద్‌లోని క్యూర్ (CURE) ప్రాంత పరిధిలో తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) ప్రత్యేక తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ తనిఖీల కోసం 13 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆహార భద్రతా అధికారులు, పోలీసు సిబ్బందితో కూడిన ఈ బృందాలు మొత్తం 26 కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్లను పరిశీలించాయి. ప్రజలకు అందించే ఆహార పదార్థాల నాణ్యత, వంటగదుల పరిశుభ్రత, నిల్వ విధానాలు, వంట నూనె వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి.
బొద్దింకలు, ఎలుకల వ్యర్థాలు.. గడువు ముగిసిన ఆహార పదార్థాలు
తనిఖీల్లో పలు అవుట్‌లెట్లలో తీవ్రమైన అపరిశుభ్రత బయటపడింది. వంటగదుల్లో బొద్దింకలు, ఇంటి ఈగలు కనిపించగా, గోడలపై ఫంగస్ పెరిగినట్లు అధికారులు గుర్తించారు. వంట పాత్రలు జిడ్డుతో నిండిపోవడం, ఆహారం తయారు చేసే పరికరాలను సరిగా శుభ్రం చేయకపోవడం, ఆహార పదార్థాలను అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నిల్వ చేయడం వంటి లోపాలు బయటపడ్డాయి. కొన్ని చోట్ల ఎలుకల వ్యర్థాలు కూడా కనిపించాయి. గడువు ముగిసిన ఆహార పదార్థాలను వినియోగానికి ఉంచినట్లు తనిఖీల్లో గుర్తించారు.
అన్నింటికంటే ఆందోళన కలిగించిన విషయం వంట నూనెను తిరిగి వినియోగించే విధానం. కొన్ని అవుట్‌లెట్లలో ఇప్పటికే ఉపయోగించిన వంట నూనెను వడపోసి మళ్లీ వాడేందుకు అనుమతి లేని సింథటిక్ మెగ్నీషియం సిలికేట్ (Synthetic Magnesium Silicate) అనే పదార్థాన్ని ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆహార భద్రతా నిబంధనలకు విరుద్ధంగా ఈ విధానం కొనసాగుతున్నట్లు నిర్ధారించారు.
ఏడు KFC, రెండు డొమినోస్ అవుట్‌లెట్లపై చర్యలు
ఈ తనిఖీల ఆధారంగా అధికారులు తొమ్మిది అవుట్‌లెట్ల FSSAI లైసెన్సులను సస్పెండ్ చేశారు. వాటిలో కేఎఫ్‌సీకి చెందిన ఏడు అవుట్‌లెట్లు ఉన్నాయి. మదీనాగూడ-మియాపూర్, సికింద్రాబాద్‌లోని సింధీ కాలనీ, చార్మినార్‌లోని పంచ్ మొహల్లా, మూసారాంబాగ్, బంజారాహిల్స్, హైటెక్ సిటీలోని శిల్పకళా వేదిక, మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌లో ఉన్న కేఎఫ్‌సీ శాఖలు ఈ జాబితాలో ఉన్నాయి.
అలాగే కొండాపూర్‌లోని శరత్ సిటీ మాల్, మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌లో ఉన్న రెండు డొమినోస్ అవుట్‌లెట్ల లైసెన్సులను కూడా అధికారులు సస్పెండ్ చేశారు. ఈ తొమ్మిది సంస్థలు తక్షణమే కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించారు. తిరిగి ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తూ అవసరమైన అనుమతులు పొందే వరకు కార్యకలాపాలు కొనసాగించడానికి వీలుండదు.
స్విగ్గీ, జొమాటో నుంచి కూడా తొలగింపు చర్యలు
లైసెన్సులు సస్పెండ్ చేసిన తొమ్మిది అవుట్‌లెట్ల వివరాలను స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు కూడా పంపించాలని తెలంగాణ ఆహార భద్రతా విభాగం నిర్ణయించింది. సంబంధిత అవుట్‌లెట్లను తమ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని ఆదేశించనుంది. FSSAI లైసెన్సులు తిరిగి పునరుద్ధరించే వరకు ఈ అవుట్‌లెట్ల నుంచి ఆన్‌లైన్‌లో ఆహార ఆర్డర్లు తీసుకోకుండా చర్యలు చేపట్టనున్నారు. దీంతో ఈ సంస్థల నుంచి ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్ చేసే వినియోగదారులపైనా ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.
మరో ఎనిమిది అవుట్‌లెట్లకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు
తనిఖీల్లో కొన్ని లోపాలు గుర్తించినప్పటికీ తక్షణ లైసెన్స్ సస్పెన్షన్ అవసరం లేని మరో ఎనిమిది అవుట్‌లెట్లకు అధికారులు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేయనున్నారు. వీటిలో డొమినోస్‌కు చెందిన నిజాంపేట్, మియాపూర్, హిమాయత్‌నగర్, మలక్‌పేట్ శాఖలు ఉన్నాయి. కేఎఫ్‌సీకి చెందిన కొండాపూర్ శరత్ సిటీ మాల్, కార్ఖానా, హిమాయత్‌నగర్, షేక్‌పేట్ అవుట్‌లెట్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఈ సంస్థలు తమ వంటగదులు, ఆహార నిల్వ విధానాలు, పరిశుభ్రత, ఆహార తయారీ ప్రక్రియల్లో గుర్తించిన లోపాలను సరిచేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహించి నిబంధనల అమలును పరిశీలిస్తారు. ప్రమాణాలు పాటిస్తున్నట్లు నిర్ధారణ అయిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.
మరో ఐదు అవుట్‌లెట్లకు షోకాజ్ నోటీసులు
తీవ్రమైన ఉల్లంఘనలకు సంబంధించి మరో ఐదు అవుట్‌లెట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. డొమినోస్‌కు చెందిన కార్ఖానా, గచ్చిబౌలి, హైటెక్ సిటీ శాఖలు, కేఎఫ్‌సీకి చెందిన నిజాంపేట్, గచ్చిబౌలి శాఖలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా సంస్థలు తమపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అవి సమర్పించే సమాధానాలను పరిశీలించిన తర్వాత జరిమానాలు సహా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
20 ఆహార నమూనాల సేకరణ.. 52 కిలోల రసాయన పదార్థం స్వాధీనం
ఈ ప్రత్యేక తనిఖీల సందర్భంగా కల్తీ జరిగి ఉండవచ్చన్న అనుమానంతో అధికారులు మొత్తం 20 ఆహార నమూనాలను సేకరించారు. వాటిని పరీక్షల కోసం పంపించనున్నారు. అదేవిధంగా ఉపయోగించిన వంట నూనెను వడపోసి తిరిగి వినియోగించేందుకు ఉపయోగిస్తున్నట్లు అనుమానించిన సుమారు 52 కిలోల సింథటిక్ మెగ్నీషియం సిలికేట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ బ్రాండ్ల అవుట్‌లెట్లలో బయటపడిన ఈ లోపాలు ఆహార భద్రత, పరిశుభ్రతపై మరోసారి చర్చకు దారితీశాయి. బ్రాండెడ్ రెస్టారెంట్లలో ఆహారం తీసుకుంటే నాణ్యత, పరిశుభ్రతకు హామీ ఉంటుందని వినియోగదారులు భావిస్తుంటారు. అయితే, ఇలాంటి తనిఖీలు ఆహార సంస్థలు నిరంతరం నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. ఆహార భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని తెలంగాణ అధికారులు చేపట్టిన ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి.
Be the first to react