మీకు అస్సలు సంబంధం లేకుండానే తెలియని వ్యక్తులు వాట్సాప్ గ్రూపుల్లో చేర్చేస్తున్నారా? స్టాక్ మార్కెట్, క్రిప్టో పెట్టుబడుల పేరుతో వచ్చే స్పామ్ మెసేజ్‌లతో విసిగిపోతున్నారా? అయితే మీకో శుభవార్త. యూజర్ల భద్రత, ప్రైవసీని కాపాడటానికి వాట్సాప్ కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది.
‘సేఫ్టీ ఓవర్‌వ్యూ’ పేరుతో వచ్చిన ఈ ఫీచర్ వల్ల ఇకమీదట మీరు ఎలాంటి గ్రూప్‌లో చేరాలో, చేరకూడదో పూర్తిగా మీరు నిర్ణయించుకోవచ్చు. ఎవరో ఒకరు మిమ్మల్ని కొత్త గ్రూప్‌లో యాడ్ చేసిన వెంటనే ఆ గ్రూప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
ఎవరు గ్రూప్ క్రియేట్ చేశారు, ఎవరి ద్వారా యాడ్ చేయబడ్డారు, అందులో ఉన్న మెంబర్స్ సంఖ్య, ఎప్పుడో గ్రూప్ ఏర్పాటు చేశారో అన్న సమాచారం అందుతుంది. అవసరమైతే, ఆ గ్రూప్‌లో ఇప్పటి వరకు జరిగిన చాట్ హిస్టరీని కూడా చూడవచ్చు.
వివరాలు చూసి గ్రూప్ నమ్మదగినదని అనిపిస్తే చెక్‌మార్క్‌పై క్లిక్ చేసి కొనసాగవచ్చు. లేదనిపిస్తే, నోటిఫికేషన్లు కూడా మ్యూట్‌లో ఉండగానే, సులభంగా గ్రూప్ నుంచి ఎగ్జిట్ కావచ్చు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ టిప్స్, క్రిప్టో లాభాలు అంటూ జరిగే ఆన్‌లైన్ మోసాలకు ఇది బిగ్ బ్రేక్ అవుతుందని నిపుణులు అంటున్నారు.
ఇక స్కామ్‌లను అరికట్టే క్రమంలో వాట్సాప్ ఇప్పటికే 68 లక్షల ఫేక్ అకౌంట్‌లను బ్లాక్ చేసింది. త్వరలోనే మరో కొత్త సెక్యూరిటీ ఫీచర్ కూడా రాబోతోంది. దీనివల్ల మీ కాంటాక్ట్ లిస్టులో లేని నంబర్ నుంచి మెసేజ్ వస్తే, ఆ వ్యక్తి గురించి అదనపు హెచ్చరికలు మీకు కనిపిస్తాయి. దీంతో వినియోగదారులు మోసపోకుండా ముందే జాగ్రత్త పడగలరని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.