ఫొటోలు గడిచిపోయిన కాలాన్ని జ్ఞాపకాలను పదిలపరుస్తాయి కానీ ఆ జ్ఞాపకాలకు ప్రాణం పోసి, అవి కళ్ళముందే కదులుతున్నట్లు ఉంటే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఆలోచనతో సెర్చ్ ఇంజన్ దిగ్గజం 'గూగుల్' ఒక వినూత్న ఫీచర్‌ను తన 'గూగుల్ ఫొటోస్' యాప్‌లోకి తీసుకువచ్చింది. ఇప్పటివరకు కేవలం నిశ్చలంగా ఉన్న మీ ఫొటోలను, ఇకపై మీరే స్వయంగా దర్శకులై వీడియోలుగా మార్చుకోవచ్చు. అది కూడా కేవలం ఒక చిన్న మెసేజ్ లేదా టెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్‌తో…
గత ఏడాది గూగుల్ పరిచయం చేసిన ‘ఫొటో టు వీడియో’ (Photo to video) ఫీచర్‌ను ఇప్పుడు మరింత ఆధునీకరించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో టెక్స్ట్-ఆధారిత ప్రాంప్ట్‌లను జోడించింది. గతంలో గూగుల్ ఫొటోస్‌లో ఒక బొమ్మను వీడియోగా మార్చాలంటే కేవలం కొన్ని పరిమితమైన ఆప్షన్లు మాత్రమే ఉండేవి. కానీ తాజా అప్‌డేట్‌తో వినియోగదారులు తమకు నచ్చినట్లుగా ఫొటోలోని కదలికలను నియంత్రించవచ్చు.
ఉదాహరణకు, మీరు ఒక చెట్టు దగ్గర నిలబడి ఉన్న ఫొటోను సెలెక్ట్ చేసి గాలికి ఆకులు కదలాలి అని టైప్ చేస్తే చాలు.. నిమిషాల్లో ఆ ఫొటో ఒక అందమైన వీడియో క్లిప్‌గా మారిపోతుంది. మొదటిగా గూగుల్ ఫొటోస్ యాప్‌లో Create ఆప్షన్‌లోకి వెళ్లి Photo to video ని ఎంచుకోవాలి. ఇక్కడ మీకు మూడు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి టెక్స్ట్ డిస్క్రిప్షన్ అంటే ఫొటోలోని వ్యక్తులు లేదా వస్తువులు ఎలా కదలాలో మీరు ఇక్కడ వివరించవచ్చు. లైట్ మోషన్ ముఖ కవళికలు లేదా శరీర భంగిమల్లో స్వల్ప మార్పులను ఈ ఆప్షన్ తీసుకువస్తుంది.
ఐ యామ్ ఫీలింగ్ లక్కీ ఇది పూర్తిగా గూగుల్ నిర్ణయం. సాఫ్ట్‌వేర్ తనకు నచ్చిన రీతిలో ఆ ఫొటోకు కదలికలను, ఎఫెక్ట్‌లను జోడిస్తుంది.ఈ ఫీచర్ వెనుక అత్యంత శక్తివంతమైన ఏఐ అల్గారిథమ్స్ పనిచేస్తున్నాయి. ఇది ఫొటోలోని వస్తువులను విశ్లేషిస్తుంది. ఉదాహరణకు.. గాలి వీస్తున్నట్లు మీరు ప్రాంప్ట్ ఇస్తే.. ఆ గాలి ప్రభావం కేవలం బట్టలు, జుట్టు లేదా చెట్లపైనే ఉండేలా చూస్తుంది తప్ప, పక్కనే ఉన్న భవనాలు లేదా స్థిరంగా ఉండే వస్తువులను కదిలించదు. దీనివల్ల వీడియో చాలా సహజంగా కనిపిస్తుంది.
సాధారణ గ్యాలరీ యాప్‌లు కేవలం జూమ్-ఇన్, జూమ్-అవుట్ వంటి ఎఫెక్ట్‌లనే ఇస్తాయి. కానీ గూగుల్ ఫొటోస్ ఏఐ ద్వారా కొత్త ఫ్రేమ్‌లను సృష్టించి, ఒక పూర్తి స్థాయి సినిమాటిక్ అనుభూతిని అందిస్తుంది. ప్రస్తుతం రోల్ అవుట్ అవుతున్న ఈ ఫీచర్ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రానుంది. స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని ఇష్టపడే వారికి ఇది ఒక గొప్ప వరమనే చెప్పుకోవచ్చు.