ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో అద్భుతమైన ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. సాధారణంగా మనం ఏదైనా వాట్సాప్ స్టేటస్ పెట్టినప్పుడు, అది ఎవరికి కనిపించాలనేది ముందే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పొరపాటున 'మై కాంటాక్ట్స్' సెట్టింగ్‌లో ఉంచి, ఆఫీస్ బాస్ లేదా బంధువులకు కనిపించకూడదనుకున్న ఫోటోను అప్‌లోడ్ చేస్తే.. వెంటనే డిలీట్ చేయడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. కానీ, ఇకపై ఆ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
స్టేటస్ అప్‌లోడ్ చేసిన తర్వాత కూడా దాని ప్రైవసీ సెట్టింగ్స్‌ను మార్చుకునేలా వాట్సాప్ ఒక 'మ్యాజిక్ బటన్'ను తీసుకువస్తోంది.ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, వాట్సాప్ ఒక కొత్త 'ఆడియన్స్ సెలక్షన్' ప్యానెల్‌ను అభివృద్ధి చేస్తోంది. వినియోగదారులు తమ స్టేటస్‌ను ఎవరు చూశారో తెలుసుకోవడానికి 'వ్యూవర్స్ లిస్ట్'ను ఓపెన్ చేసినప్పుడు, అక్కడే ఈ కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. దీని ద్వారా స్టేటస్ లైవ్‌లో ఉన్నప్పుడే.. 'మై కాంటాక్ట్స్', 'మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్', లేదా 'ఓన్లీ షేర్ విత్' వంటి ఆప్షన్లను మార్చుకోవచ్చు. అంటే, ఫోటో డిలీట్ చేయకుండానే, చూసే వ్యక్తుల జాబితాను మీరు నియంత్రించవచ్చన్నమాట.
సోషల్ మీడియా యుగంలో వ్యక్తిగత గోప్యత అనేది అత్యంత కీలకంగా మారింది. కొన్నిసార్లు పొరపాటున సున్నితమైన సమాచారాన్ని స్టేటస్‌గా పెట్టినప్పుడు, దానివల్ల తలెత్తే ఇబ్బందులను నివారించడమే ఈ అప్‌డేట్ ప్రధాన ఉద్దేశ్యం. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్‌డేట్లు అందరికీ తెలియకూడదని భావిస్తారు. అటువంటి వారికి ఈ ఫీచర్ ఒక వరంలా మారనుంది. స్టేటస్ పెట్టిన క్షణాల్లోనే మనకు నచ్చని వారిని జాబితా నుండి తొలగించే వెసులుబాటు కలగడం వల్ల యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపడుతుంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ (iOS) ప్లాట్‌ఫామ్స్‌లో బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అక్కడ విజయవంతంగా పరీక్షలు పూర్తయిన తర్వాత, కొద్ది వారాల్లోనే సాధారణ వినియోగదారులందరికీ స్టేటస్ ట్యాబ్‌లో ఈ అప్‌డేట్ కనిపిస్తుంది. దీనితో పాటు 'ఎడిట్' ఆప్షన్‌ను కూడా తీసుకువచ్చే అవకాశం ఉందని సమాచారం. అంటే స్టేటస్‌లో ఏదైనా తప్పుగా రాసినా లేదా మార్పులు చేయాలన్నా డిలీట్ చేయకుండానే సవరించుకోవచ్చు.