Japan: చాట్జీపీటీ సాయంతో సైబర్ దాడి.. 15 ఏళ్ల విద్యార్థి అరెస్ట్.. 46 వేలకుపైగా ఖాతాలు రద్దు!
Japan: జపాన్లో కేవలం 15 ఏళ్ల హైస్కూల్ విద్యార్థి చేసిన సైబర్ దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ అనిమే స్ట్రీమింగ్ సేవ బండై ఛానెల్ పై జరిగిన సైబర్ దాడి కేసులో ఆ విద్యార్థిని టోక్యో మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
బండై ఛానెల్పై భారీ సైబర్ దాడి.. 46 వేలకుపైగా ఖాతాలు రద్దు..
భద్రతా లోపాన్ని ఆసరాగా చేసుకున్న విద్యార్థి.. జపాన్లో అరెస్ట్..
టోక్యో: జపాన్లో కేవలం 15 ఏళ్ల హైస్కూల్ విద్యార్థి చేసిన సైబర్ దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ అనిమే స్ట్రీమింగ్ సేవ బండై ఛానెల్ (Bandai Channel) పై జరిగిన సైబర్ దాడి కేసులో ఆ విద్యార్థిని టోక్యో మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాఫ్ట్వేర్ రూపొందించేందుకు చాట్జీపీటీ సహాయం తీసుకున్నట్లు విచారణలో అతడు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, 2025 నవంబర్లో బండై నామ్కో ఫిల్మ్వర్క్స్కు చెందిన బండై ఛానెల్ వెబ్సైట్లో ఉన్న భద్రతా లోపాన్ని గుర్తించిన విద్యార్థి, దానిని ఉపయోగించి సభ్యుల ఖాతాల్లోకి అనధికారికంగా ప్రవేశించే ప్రోగ్రామ్ను రూపొందించాడు. ఆ ప్రోగ్రామ్ వల్ల ఏకంగా 46,812 మంది వినియోగదారుల సభ్యత్వాలు రద్దు అయ్యాయి.
విచారణలో విద్యార్థి మాట్లాడుతూ, ఖాతాల రద్దు ప్రక్రియకు సంబంధించిన సోర్స్ కోడ్ను తానే రూపొందించానని తెలిపాడు. అయితే ఆ ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుండటంతో, చాట్జీపీటీని సంప్రదించి మరో ప్రోగ్రామింగ్ భాషలో కోడ్ పూర్తి చేసినట్లు వెల్లడించాడు.
పోలీసుల కథనం ప్రకారం, 2025 నవంబర్ 4న అతడు కంపెనీ సర్వర్లకు నకిలీ ఆదేశాలు పంపడంతో భారీ స్థాయిలో ఖాతాలు రద్దయ్యాయి. నవంబర్ 6 నుంచి సంస్థ సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సిస్టమ్ మరమ్మతుల అనంతరం డిసెంబర్లోనే సేవలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించగలిగారు. అనంతరం బండై నామ్కో ఫిల్మ్వర్క్స్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దర్యాప్తులో మరో ఆసక్తికర విషయం కూడా బయటపడింది. కంపెనీ అతని యాక్సెస్ను నిలిపివేసిన తర్వాత కూడా, తన ఐపీ అడ్రస్ను సుమారు 30 సార్లు మార్చుతూ మళ్లీ మళ్లీ సర్వర్లకు హానికర ఆదేశాలు పంపినట్లు పోలీసులు గుర్తించారు.
దాడి జరిగిన సమయంలో అతడు జూనియర్ హైస్కూల్ విద్యార్థి అని అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూన్లో కూడా ఇతర కంప్యూటర్ నేరాలకు సంబంధించిన కేసులో అతడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. చిన్నప్పటి నుంచే కంప్యూటర్లపై ఆసక్తి పెంచుకున్న అతడు నాలుగో తరగతి నుంచే ప్రోగ్రామింగ్ను స్వయంగా నేర్చుకున్నట్లు విచారణలో చెప్పాడు.
"కంపెనీపై నాకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదు. చాలా ఖాతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉండటంతోనే ఈ పని చేశాను. నాకు అందుబాటులోకి వచ్చిన సమాచారాన్ని ఉపయోగించాను అంతే" అని విచారణలో తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన తర్వాత బండై నామ్కో ఫిల్మ్వర్క్స్ ప్రభావిత వినియోగదారులందరికీ వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చింది. ఫిషింగ్, నకిలీ ఈమెయిళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సభ్యత్వం రద్దైన వారు మళ్లీ నమోదు చేసుకోవాలని కోరడంతో పాటు, సేవలు నిలిచిపోయిన సమయంలో వసూలు చేసిన చందా మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది.
అయితే ఈ ఘటనలో లీకైన వినియోగదారుల సమాచారం ఆన్లైన్లో బయటపడినట్లు లేదా దుర్వినియోగమైనట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని కంపెనీ స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసి, క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తామని కంపెనీ వెల్లడించింది.
Tags
Be the first to react
