భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలు పి.టి.ఉషా 2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులపై కీలక ప్రకటన చేశారు. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం ఈ గేమ్స్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన నవంబర్ 25 లేదా 26 తేదీల్లో జరిగే గ్లాస్గో వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో వెలువడనుంది. ఈ సమావేశం ద్వారా ఏ దేశం లేదా నగరానికి 2030 సెంటెనరీ కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్యం దక్కుతుందో తేలనుంది.
పి.టి.ఉషా నిన్న ఢిల్లీ లోని సాకేత్ డీఎల్ఎఫ్ అవెన్యూలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో యూనియన్ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి మానసుఖ్ మాండవియా 2026 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ కోసం కింగ్’స్ బ్యాటన్ రిలేను దేశ రాజధానిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి.టి.ఉషా మాట్లాడుతూ 2030 కామన్వెల్త్ గేమ్స్‌పై చాలా త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది. ఇది భారత క్రీడాకారులకు గొప్ప ప్రేరణగా ఉంటుంది అని తెలిపారు.
ఇటీవల కామన్వెల్త్ స్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అహ్మదాబాద్ నగరాన్ని 2030 కామన్వెల్త్ గేమ్స్ హోస్ట్ సిటీగా సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సిఫారసు గ్లాస్గో సర్వసభ్య సమావేశంలో తుది నిర్ణయం కోసం ఉంచబడింది. ఇది ఆమోదం పొందితే భారతదేశం సెంటెనరీ ఎడిషన్ గేమ్స్‌ను నిర్వహించే గౌరవం పొందుతుంది.
కామన్వెల్త్ స్పోర్ట్ కమిటీ ప్రకారం ఈ నిర్ణయం విస్తృతమైన మూల్యాంకన ప్రక్రియ తర్వాత తీసుకోబడింది. అభ్యర్థి నగరాల సాంకేతిక సామర్థ్యం, మౌలిక వసతులు, ఆటగాళ్ల సౌకర్యాలు, పాలన విధానం, కామన్వెల్త్ విలువలతో అనుసంధానం వంటి అంశాలను సమీక్షించి అహ్మదాబాద్‌కు అత్యుత్తమ రేటింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు.
భారత్ కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో బలమైన ప్రదర్శన కనబరచిన దేశాల్లో ఒకటి. 2022లో బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో భారత్ పతక పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. అహ్మదాబాద్ ప్రతిపాదనలో భారత క్రీడా మౌలిక సదుపాయాలు క్రీడా సంస్కృతి, యువతలో ఉన్న ఉత్సాహం వంటి అంశాలను బలంగా ప్రదర్శించారు. గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే క్రీడా విలేజ్ నిర్మాణం, కొత్త స్టేడియంల అభివృద్ధి, అంతర్జాతీయ ప్రమాణాల హోటల్ సౌకర్యాల ప్రణాళికను సమర్పించినట్లు సమాచారం.
పి.టి.ఉషా ఈ ప్రకటనతో భారత్‌లోని క్రీడాభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఆమె వ్యాఖ్యలు భారత్‌కి ఇది ఒక గొప్ప గౌరవం అవుతుంది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణతో భారత్ గ్లోబల్ క్రీడా పటంలో మరింత ప్రాధాన్యం పొందుతుంది. ఇది మా క్రీడాకారుల తరాలకు స్ఫూర్తినిస్తుంది అని చెప్పారు.
ఈ ప్రకటన కేవలం భారత్‌కే కాదు మొత్తం ఆసియా క్రీడా రంగానికి ఒక సానుకూల సంకేతంగా చూస్తున్నారు విశ్లేషకులు. 2026 గ్లాస్గో గేమ్స్ విజయవంతంగా పూర్తి కాగానే 2030 అహ్మదాబాద్ గేమ్స్ దిశగా నడుస్తే, భారత్ మరోసారి ప్రపంచ క్రీడా చరిత్రలో తన ముద్ర వేసే అవకాశం ఉంది.