విమానయాన రంగంలో ఇటీవల పెరుగుతున్న జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో సివిల్ ఏవియేషన్ ప్రధాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అత్యవసర చర్యలు ప్రారంభించింది. గగనతలం భద్రతకు ముప్పుగా మారుతున్న ఈ స్పూఫింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు సంస్థ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలోని అన్ని విమానయాన సంస్థలు, పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు (ఏటీసీ) ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
డీజీసీఏ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో, జీపీఎస్‌కు సంబంధించి ఎటువంటి అసాధారణ సమస్య తలెత్తినా 10 నిమిషాల వ్యవధిలోనే సంబంధిత విభాగానికి తప్పనిసరిగా నివేదించాలని ఆదేశించింది. విధి నిర్వహణలో ఉన్న పైలట్, ఏటీసీ కంట్రోలర్ లేదా సాంకేతిక సిబ్బంది ఎవరైనా జీపీఎస్ పనితీరులో తేడా గమనిస్తే వెంటనే సమాచారం అందించాల్సి ఉంటుంది. ఘటన జరిగిన సమయం, తేదీ, విమానం వివరాలు, ప్రయాణ మార్గం వంటి అన్ని వివరాలను నివేదికలో పొందుపరచాలని తెలిపింది. అలాగే జీపీఎస్ జామింగ్, స్పూఫింగ్, సిగ్నల్ లాస్ లేదా ఇంటిగ్రిటీ ఎర్రర్ వంటి ఏ రకం సమస్య ఎదురైందో స్పష్టంగా తెలియజేయాల్సిందిగా సూచించింది.
ఇటీవల ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGIA) జరిగిన ఘటన ఈ చర్యలకు కారణమైంది. జీపీఎస్ స్పూఫింగ్ కారణంగా రెండు రోజులపాటు వందలాది విమానాల రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగించాయి. దీని ఫలితంగా అనేక విమానాలు ఆలస్యమయ్యాయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు డీజీసీఏ ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సిస్టమ్ ద్వారా జీపీఎస్ సిగ్నల్ లోపాలను రియల్‌టైమ్‌లో గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
డీజీసీఏ అంచనా ప్రకారం, 2023 నవంబర్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 465 జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు నమోదయ్యాయి. ముఖ్యంగా అమృత్‌సర్, జమ్మూ వంటి సరిహద్దు ప్రాంతాలు ఈ సమస్యకు హాట్‌స్పాట్లుగా మారాయి. గగనతల భద్రతను బలోపేతం చేయడం, విమాన రవాణాలో సమయపాలనను మెరుగుపరచడం, సాంకేతిక జోక్యాన్ని పెంచడం వంటి లక్ష్యాలతో డీజీసీఏ ఈ చర్యలను అమలు చేస్తోంది. జీపీఎస్ ఆధారిత నావిగేషన్‌పై ఆధారపడే ఆధునిక విమానాల భద్రతకు ఇది అత్యంత కీలకమైన నిర్ణయంగా భావిస్తున్నారు.