భారత్‌లో గ్రీన్ ఎనర్జీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ప్రభుత్వం నిర్ధేశించిన 5 మిలియన్ మెట్రిక్ టన్నుల (MMT) గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్య లక్ష్యాన్ని 2030 నాటికి సాధించడం కష్టమని అధికార వర్గాలు అంగీకరిస్తున్నాయి. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద 2023లో ప్రారంభించిన ప్రాజెక్టు లక్ష్యాలకు అనుగుణంగా ప్రగతి జరగకపోవడం ఈ ఆందోళనకు కారణంగా చెబుతున్నారు.
పర్యావరణ సుస్థిరత, ఉద్గారాల నియంత్రణ, స్వచ్ఛ శక్తి వినియోగం లక్ష్యంగా ప్రభుత్వం ఈ మిషన్‌ను ప్రారంభించింది. కానీ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, మౌలిక సదుపాయాల లోపం, పెట్టుబడుల కొరత వంటి అంశాలు ఈ ప్రగతిని మందగింపజేస్తున్నాయి. ఎనర్జీ శాఖ సెక్రటరీ ఇచ్చిన తాజా వివరాల ప్రకారం, ప్రాజెక్టు మొదటి దశలో ఊహించిన కంటే నెమ్మదిగా అమలు జరుగుతోంది.
భారత ప్రభుత్వం 2030 నాటికి 5 MMT గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి యూనిట్లు, ఎలక్ట్రోలైజర్ తయారీ ప్లాంట్లు, పునరుత్పాదక శక్తి ఆధారిత ఉత్పత్తి కేంద్రాలు దేశవ్యాప్తంగా నెలకొల్పాలని ప్రణాళిక ఉంది. ఈ ప్రాజెక్టు దేశం ఫాసిల్ ఫ్యూయల్‌పై ఆధారపడకుండా శక్తి స్వావలంబన దిశగా అడుగులు వేయాలనే ఉద్దేశంతో రూపొందించబడింది.
అయితే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వ్యవస్థ సాంకేతికంగా క్లిష్టమైనది. ప్రస్తుతానికి ఎలక్ట్రోలైజర్‌ల ధరలు అధికంగా ఉండటం, వాటి ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటం ప్రధాన సమస్యగా ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం అవసరమైన భారీ పెట్టుబడులు ప్రైవేట్ రంగం నుండి రావడంలో ఆలస్యం జరుగుతోంది.
పునరుత్పాదక శక్తి వనరులు ముఖ్యంగా సౌరశక్తి, వాయు శక్తి ఆధారంగా హైడ్రోజన్ తయారీకి పెద్ద ఎత్తున విద్యుత్ సరఫరా అవసరం. కానీ చాలా రాష్ట్రాల్లో గ్రిడ్ కనెక్టివిటీ సమస్యలు, ప్రాజెక్టు అనుమతుల జాప్యం, భూసేకరణలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఫలితంగా అనేక ప్రతిపాదిత ప్రాజెక్టులు పేపర్‌పైనే ఆగిపోయాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యాలను చేరుకోవాలంటే మరింత సమన్వయం, నిధుల మద్దతు అవసరమని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు. “ప్రస్తుత దశలో ప్రైవేట్ కంపెనీలు, పబ్లిక్ రంగ సంస్థలు కలిసి పనిచేయాలి. అలాగే పన్ను రాయితీలు, ఉత్పత్తి ప్రోత్సాహకాలు పెంచితే పెట్టుబడిదారుల నమ్మకం పెరుగుతుంది అని ఒక పరిశ్రమ ప్రతినిధి తెలపడం జరిగినది.
ఇప్పటివరకు ప్రకటించిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ ప్రాజెక్టులు ప్రతిపాదించబడ్డాయి. వాటిలో కొన్నింటి నిర్మాణం మొదలైనప్పటికీ, ఎక్కువశాతం ప్రాజెక్టులు టెండర్ దశలో ఉన్నాయి. సాంకేతికత పరంగా స్థానిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, దిగుమతులపై ఆధారపడటం తగ్గించడం ఇప్పుడు అత్యవసరమని అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రాజెక్టు భారత్‌కు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రాముఖ్యత కలిగించింది. గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతి దేశంగా భారత్ ఎదగాలనే లక్ష్యంతో అనేక విదేశీ పెట్టుబడిదారులు కూడా ఆసక్తి చూపుతున్నారు. కానీ ఉత్పత్తి స్థాయిని స్థిరపరచకముందు ఎగుమతులపై దృష్టి పెట్టడం సవాలుగా మారవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
భారత్ ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ రంగంలో ప్రాధాన్యాన్ని సంపాదించడానికి చైనా, జర్మనీ, జపాన్ వంటి దేశాలతో పోటీ పడుతోంది. ఈ దేశాలు ఇప్పటికే భారీ స్థాయి ఉత్పత్తి యూనిట్లు నెలకొల్పగా, భారత్ మాత్రం ఇంకా ప్రణాళిక దశలో ఉంది. అయినప్పటికీ, గ్లోబల్ ఎనర్జీ మార్పుల్లో భారత్ కీలక పాత్ర పోషించగలదనే నమ్మకం ప్రభుత్వానికి ఉంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం,మ 2030 నాటికి 5 MMT లక్ష్యం సాధ్యంకానప్పటికీ, 3 MMT వరకు ఉత్పత్తి సామర్థ్యం సాధించగలమనే అంచనాలు ఉన్నాయి. ఇది భారత్‌కు వాతావరణ లక్ష్యాల దిశలో ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుంది.