బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) వ్యవహారశైలి ఇప్పుడు ప్రపంచ క్రికెట్ వేదికపై ఆ దేశ పరువును గంగలో కలిపేలా చేస్తోంది. ఒకవైపు టీ20 ప్రపంచకప్ 2026 నుండి ఐసీసీ బంగ్లాదేశ్‌ను బహిష్కరిస్తే, మరోవైపు సొంత బోర్డు తన ఆటగాళ్ల పట్ల అనుసరిస్తున్న తీరు 'వెన్నుపోటు'ను తలపిస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాంను మళ్లీ ఫైనాన్స్ కమిటీ చీఫ్‌గా నియమించడం ద్వారా బీసీబీ తన నైజం చాటుకుంది.
వివాదం అంతా బోర్డు డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాం చేసిన అనుచిత వ్యాఖ్యలతో మొదలైంది. భారత్‌లో జరగనున్న ప్రపంచకప్ వేదికల విషయంలో బీసీసీఐతో చర్చలు జరపాలని మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సూచించగా, అతడిని ఇండియన్ ఏజెంట్ అంటూ నజ్ముల్ నోరు పారేసుకున్నారు. అంతటితో ఆగకుండా, ఆటగాళ్లకు ఇచ్చే పరిహారంపై కూడా విషం చిమ్మారు. జట్టు సరిగ్గా ఆడకపోతే వారి వద్ద నుండి డబ్బులు వెనక్కి తీసుకోవాలంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
ఆటగాళ్ల పోరాటం.. బోర్డు కపట నాటకం.. నజ్ముల్ ఇస్లాం వ్యాఖ్యలతో ఆగ్రహించిన బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్లు మహ్మద్ మిథున్ నాయకత్వంలో ఆందోళనకు దిగారు. నజ్ముల్ హొస్సేన్ శాంటో, మెహిదీ హసన్ మిరాజ్ వంటి కీలక ఆటగాళ్లు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)ను బహిష్కరించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటం, ప్రసార హక్కుల ఆదాయం దెబ్బతినే ప్రమాదం ఉండటంతో.. బీసీబీ తలవంచి నజ్ముల్‌ను పదవి నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆటగాళ్లు తమ నిరసన విరమించి మైదానంలోకి దిగారు.
భారత్‌లో భద్రతా కారణాలు చూపుతూ ప్రపంచకప్ ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. అయితే ఐసీసీ స్వతంత్ర కమిటీ ఈ కారణాలు నమ్మశక్యంగా లేవు అని తేల్చి చెప్పింది. ఫలితంగా ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుంటూ బంగ్లాదేశ్‌ను టోర్నీ నుండి తప్పించింది. ఆ స్థానాన్ని స్కాట్లాండ్ జట్టుతో భర్తీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
బీసీబీ ద్వంద్వ నీతి ఐసీసీ వేటు వేసిన కొద్ది గంటల్లోనే బీసీబీ తన అసలు రంగు బయటపెట్టింది. నజ్ముల్ ఇస్లాం వివరణ సంతృప్తికరంగా ఉందంటూ మళ్లీ అతడిని ఫైనాన్స్ కమిటీ పీఠంపై కూర్చోబెట్టింది. ఆటగాళ్లు తమ పరువు కోసం చేసిన పోరాటాన్ని బోర్డు తుంగలో తొక్కింది. ఇది కేవలం ఆటగాళ్లపైనే కాకుండా, క్రికెట్ విలువలకు బోర్డు చేసిన ద్రోహంగా విశ్లేషకులు భావిస్తున్నారు.