అమెజాన్ అడవుల మధ్యలో జరుగుతున్న COP30 వాతావరణ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గైర్హాజరు కావడంతో ఆయన ప్రత్యర్థి, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వేదికపై నిలబడి ఆయన ట్రంప్ పట్ల విరుచుకుపడుతూ, ట్రంప్ తాత్కాలికమే, కానీ వాతావరణ బాధ్యత శాశ్వతం అంటూ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.
న్యూసమ్ ప్రసంగం అంతర్జాతీయంగా విస్తృతంగా దృష్టిని ఆకర్షించింది. ఆయన ట్రంప్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి రెండు సార్లు బయటకు రావడం మానవత్వానికి వ్యతిరేకమైన చర్య. ఇది కేవలం రాజకీయ తప్పిదం కాదు, నైతిక పరాజయం కూడా అని తీవ్రంగా విమర్శించారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే అమెరికాను పారిస్ ఒప్పందం నుంచి బయటకు తీయడం అంతర్జాతీయ సమాజం తీవ్రంగా విమర్శించింది. మానవ సృష్టి వాతావరణ మార్పులనే ‘మోసం’ అని అభివర్ణించిన ఆయన విధానం అమెరికా గ్లోబల్ ఇమేజ్‌కు దెబ్బతీసిందని న్యూసమ్ పేర్కొన్నారు. ఇది మూర్ఖత్వానికి రెండింతలు పెట్టినట్టే. గ్రీన్ ఎనర్జీని వదిలేసి ఆయిల్ పరిశ్రమలను ప్రోత్సహించడం అమెరికా భవిష్యత్తుపై ప్రమాదం అని అన్నారు.
బ్రెజిల్‌లోని బెలేమ్ నగరంలో జరుగుతున్న ఈ సదస్సులో, న్యూసమ్ స్థానిక గవర్నర్ హెల్డర్ బార్బల్హోతో కలిసి పాల్గొన్నారు. ఇద్దరూ కలిసి కెలిఫోర్నియాలో పునరుత్పాదక శక్తి వినియోగంలో సాధించిన విజయాలను ప్రస్తావించారు. న్యూసమ్ మాట్లాడుతూ, “కెలిఫోర్నియా ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ రెండు మూడవ వంతు విద్యుత్ పునరుత్పాదక శక్తుల నుంచే వస్తుంది. ఇది వాతావరణ న్యాయం సాధ్యమేనని నిరూపిస్తుంది అని చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన జర్మనీ, బ్రెజిల్ మరియు COP30 నిర్వాహకులతో వేర్వేరు సమావేశాలు కూడా నిర్వహించారు. అమెరికా కేంద్ర ప్రభుత్వం వాతావరణ ఒప్పందాల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే కూడా, రాష్ట్రాల స్థాయిలో తామే ముందడుగు వేస్తామని న్యూసమ్ స్పష్టం చేశారు. “ఫెడరల్ ప్రభుత్వం వెనక్కి తగ్గితే మేము ముందుకు వస్తాం. రాష్ట్రాలు మౌనంగా ఉండవు,” అని ఆయన అన్నారు.
అయితే COP30 చర్చల్లో రాష్ట్రాల నాయకులకు అధికారిక హోదా లేకపోవడం పరిమితిగా మారిందని న్యూమెక్సికో గవర్నర్ మిచెల్ లుజాన్ గ్రిషమ్ అంగీకరించారు. మేము ప్రధాన చర్చల్లో భాగం కాకపోయినా, వాతావరణ చర్యల్లో సమిష్టి సహకారం చూపించాలన్నదే మా ఉద్దేశం అని ఆమె తెలిపారు.
పారిస్ ఒప్పందానికి రూపకర్తలలో ఒకరైన క్రిస్టియానా ఫిగ్వెరస్ మాట్లాడుతూ ట్రంప్ గైర్హాజరు వాతావరణ సదస్సుకు మేలు చేస్తుంది. ఆయన హాజరైతే చర్చలు రాజకీయ ఒత్తిడికి లోనయ్యేవి అని అభిప్రాయపడ్డారు.
న్యూసమ్ వ్యాఖ్యలు ట్రంప్ తాత్కాలికమే అన్న వాక్యంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. “ఒక వ్యక్తి తన రాజకీయ అజెండాతో భవిష్యత్తును ఆపలేడు. ట్రంప్ తాత్కాలికుడు, కానీ పర్యావరణ బాధ్యత శాశ్వతం. బులీ లాగా ప్రవర్తించేవారికి ఎదురు నిలబడాలి అని ఆయన అన్నారు.
మేరిల్యాండ్ విశ్వవిద్యాలయం నివేదిక ప్రకారం, అమెరికా రాష్ట్రాలు, నగరాలు వాతావరణ చర్యలను కొనసాగిస్తే, 2035 నాటికి దేశ ఉద్గారాలను 50 శాతం తగ్గించడం సాధ్యమవుతుందని అంచనా వేసింది. “ప్రెసిడెంట్ ఒక స్విచ్ నొక్కి మార్పును ఆపలేడు. ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు,” అని అధ్యయనాన్ని నడిపిన నేట్ హల్ట్‌మాన్ అన్నారు.
అయితే ట్రంప్ అనుచరులు పచ్చశక్తిపై పన్ను సబ్సిడీలను రద్దు చేస్తూ, పునరుత్పాదక రంగంపై దెబ్బ కొడుతున్నారు. అయినప్పటికీ మార్కెట్ ఆధారిత గ్రీన్ ఎనర్జీ ధోరణి అమెరికాలో కొనసాగుతూనే ఉంది. న్యూసమ్ ఈ ధోరణిని మరింత బలపరచాలని పిలుపునిచ్చారు.
ఈ సదస్సులో న్యూసమ్ తన ప్రసంగం ద్వారా ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు – వాతావరణ చర్య ఒక రాజకీయ చర్చ కాదు, అది మన భవిష్యత్తు కోసం చేయాల్సిన మానవ బాధ్యత