ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రానున్న రోజుల్లో జాతీయ స్థాయి వేడుకలకు ఆతిథ్యమివ్వబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 19న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగే సత్యసాయి శత జయంతి ఉత్సవాలలో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు పుట్టపర్తికి చేరుకుని, ఉదయం 11.15 గంటలకు తిరిగి వెళ్ళనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. సత్యసాయి ఆశ్రమం ప్రాంగణంలో జరుగనున్న ఈ వేడుకల్లో ప్రధాని పాల్గొనడం పట్ల భక్తులు, స్థానిక ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 22న సత్యసాయి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరవుతారని మంత్రి తెలిపారు. నవంబర్ 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు సత్యసాయి శత జయంతి ప్రధాన వేడుకలకు హాజరవుతారు. సత్యసాయి సేవా కార్యక్రమాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకునే ఈ వేడుకలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. నవంబర్ 13 నుంచి 23 వరకు పది రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో మంత్రులు, ఉన్నతాధికారులు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. హిల్ వ్యూ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణరెడ్డి, సత్యకుమార్, సవిత, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి తదితరులు పరిశీలించారు. వేలాది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున భద్రతా ఏర్పాట్లు బలపరిచారు. వీఐపీల రాకకు అనుగుణంగా పోలీసు విభాగం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది.
ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుంచి 25 వరకు జరగనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంచమి తీర్థం రోజు తిరుచానూరు ఆలయానికి రానున్నారు. ఇప్పటికే టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు ఏర్పాట్లను సమీక్షించారు. సుమారు 75 వేలమంది భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో భద్రతా బందోబస్తు, పారిశుద్ధ్య చర్యలు, క్యూలైన్‌లు, అన్నప్రసాద ఏర్పాట్లు భారీ స్థాయిలో చేపడుతున్నారు. తిరుమల తరహాలో విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేయాలని సూచించారు. సుమారు 600 మంది పోలీసులు, 700 మంది టిటిడి సెక్యూరిటీ సిబ్బంది, 900 మంది శ్రీవారి సేవకులు, 2,000 మంది పారిశుద్ధ్య కార్మికులు సేవలు అందించనున్నారు.