రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన సమాచారం విడుదలైంది. మీరు నవంబర్ నెలలో రైల్లో ప్రయాణం చేయాలని ప్లాన్ చేస్తుంటే, షాలిమార్ స్టేషన్‌లో జరుగుతున్న పునర్నిర్మాణం మరియు ట్రాక్ మెరుగుదల పనుల కారణంగా కొన్ని ముఖ్యమైన రైళ్లు రద్దు అయ్యాయి. మరికొన్ని రైళ్లు దారి మళ్లించబడ్డాయి. దేశంలోని ప్రధాన రైల్వే కేంద్రాల్లో ఒకటైన షాలిమార్ స్టేషన్ యార్డ్‌లో నవంబర్ 12 నుంచి 21 వరకు ఈ పనులు జరుగుతుండగా, ఈ వ్యవధిలో మొత్తం పది ఎక్స్‌ప్రెస్ రైళ్ల సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. పలు ఇతర రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నడపనున్నారు.
రైల్వే అధికారుల ప్రకారం, షాలిమార్ యార్డ్‌లో ట్రాక్ రీనోవేషన్, సిగ్నల్ వ్యవస్థల మెరుగుదల, పాయింట్ మిషిన్ అప్‌గ్రేడేషన్ వంటి కీలక పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తయిన తర్వాత రైళ్ల వేగం, భద్రత, సమయపాలన మరింత మెరుగుపడుతాయని అధికారులు తెలిపారు. అయితే, ఈ సమయంలో ప్రయాణం ప్లాన్ చేసిన వారు బయలుదేరే ముందు తమ రైళ్ల స్థితిని తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించారు. ఇందుకోసం రైల్వే వెబ్‌సైట్ లేదా IRCTC యాప్ ద్వారా రియల్‌టైమ్ అప్‌డేట్లు పొందవచ్చు.
రద్దు చేయబడిన రైళ్లలో షాలిమార్–ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ కుర్లా ఎక్స్‌ప్రెస్ (18030) నవంబర్ 13 నుంచి 21 వరకు రద్దు కాగా, ముంబై–షాలిమార్ కుర్లా ఎక్స్‌ప్రెస్ (18029) నవంబర్ 12 నుంచి 19 వరకు రద్దయింది. షాలిమార్–భుజ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22830) నవంబర్ 15న, భుజ్–షాలిమార్ సూపర్‌ఫాస్ట్ (22829) నవంబర్ 18న రద్దయ్యాయి. అలాగే గోరఖ్‌పూర్–షాలిమార్, షాలిమార్–గోరఖ్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా కొన్ని తేదీలలో నడవవు. ముంబై–షాలిమార్ సమరస్తా ఎక్స్‌ప్రెస్ కూడా కొన్ని రోజులు రద్దు చేయబడింది.
దారి మళ్లించబడిన రైళ్లలో షాలిమార్–బాదంపహార్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (18049, 18050), ముంబై–షాలిమార్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ (12101, 12102), పోర్‌బందర్–షాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12905, 12906) ఉన్నాయి. ఈ రైళ్లు తాత్కాలికంగా సంత్రాగచ్చి స్టేషన్ వరకు లేదా అక్కడి నుంచి మాత్రమే నడుస్తాయి. ఈ మార్పుల కారణంగా కొంత అసౌకర్యం కలిగినా, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు తీసుకున్నామని రైల్వే స్పష్టంచేసింది. షాలిమార్ యార్డ్ పనులు పూర్తి అయిన వెంటనే రద్దు చేసిన అన్ని రైళ్లను మళ్లీ సాధారణ షెడ్యూల్‌లో నడిపే అవకాశం ఉంది.