హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు మెట్రో రైలు ఒక పెద్ద ఉపశమనం అవుతోంది. నగరంలో ఎక్కడికెళ్లాలన్నా గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయే పరిస్థితి ఉండేది. అయితే మెట్రో రైలు ప్రారంభమైన తర్వాత చాలా మంది దానిని ప్రధాన రవాణా సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు మెట్రో ద్వారా గమ్యస్థానాలకు సౌకర్యవంతంగా చేరుతున్నారు. అయితే, రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ కారణంగా పీక్ అవర్స్‌లో రైళ్లలో తీవ్ర గుంపు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) అత్యంత రద్దీ మార్గాల్లో నాలుగు, ఆరు కోచ్‌ల రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇప్పటివరకు నగరంలోని మూడు కారిడార్లలో మూడు కోచ్‌లతో 56 రైళ్లు నడుస్తున్నాయి. కానీ ప్రయాణికుల నుండి వచ్చిన అనేక అభ్యర్థనల అనంతరం, మెట్రో అధికారులు కోచ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి మహానగరాల్లో మెట్రో రైళ్లు ఇప్పటికే నాలుగు, ఆరు, ఎనిమిది కోచ్‌లతో నడుస్తున్నాయన్న ఉదాహరణలను ఉటంకిస్తూ, హైదరాబాద్ మెట్రో సామర్థ్యాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం పీక్ అవర్స్‌లో 5 నిమిషాలకో ట్రైన్, సాధారణ సమయాల్లో 10 నిమిషాలకో ట్రైన్ నడుస్తోంది. అయితే త్వరలోనే 2 నిమిషాల వ్యవధిలో రైళ్లు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న మార్గాల్లో కొత్త కోచ్‌లు జోడించడానికి కనీసం 40 నుంచి 60 అదనపు కోచ్‌లను సేకరించాలనే నిర్ణయం తీసుకున్నారు. దీంతో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరిగి, ప్రయాణికులకి మరింత సౌకర్యం లభించనుంది.
హైదరాబాద్ మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ, “కొత్త కోచ్‌లను ఇప్పటికే ఉన్న రైళ్లకు జోడించడం కాకుండా, మార్గాల అవసరాన్ని బట్టి మూడు, నాలుగు లేదా ఆరు కోచ్‌లతో మల్టీ రైళ్లు నడపాలని యోచిస్తున్నాం. ఈ కోచ్‌లను ఆల్‌స్టోమ్, బీఈఎంఎల్ లిమిటెడ్, టిట్లఘర్ రైల్ సిస్టమ్స్ వంటి దేశంలోని ప్రముఖ తయారీ యూనిట్ల నుంచి సేకరించనున్నాం. రెండు రైళ్ల మధ్య సమయాన్ని రెండు నిమిషాలకు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం” అని తెలిపారు. ఈ మార్పులు ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, పీక్ అవర్స్‌లో ప్రయాణించే వారికి పెద్ద సౌకర్యం కలిగించనున్నాయని చెప్పారు. కొత్త కోచ్‌లు హైదరాబాద్‌కు చేరుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశమున్నప్పటికీ, ఇది నగర రవాణా వ్యవస్థలో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.