అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన కిడ్నీ రాకెట్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మహిళ యమున అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు విచారణను వేగవంతం చేస్తూ, నిందితుల దారుణ చర్యలను బహిర్గతం చేస్తున్నారు.
యమున విశాఖపట్నంలోని ఓ పత్రికా కార్యాలయంలో పనిచేసే మహిళ. ఉద్యోగంతో పాటు కుటుంబ బాధ్యతలు కూడా చూసుకుంటూ సాదాసీదా జీవితం గడిపేది. అయితే, పిక్నిక్ పేరుతో మదనపల్లికి వచ్చిన ఆమెను కిడ్నీ రాకెట్ సభ్యులు మోసం చేసి, దారుణంగా కిడ్నీలు తొలగించినట్లు సమాచారం.
మహిళను పిక్నిక్‌కు ఆహ్వానించి, మదనపల్లిలోని ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లి, మత్తు మందు ఇచ్చి కిడ్నీలు తీసేసినట్లు విచారణలో బయటపడింది. ఈ దారుణం తర్వాత యమున ఆరోగ్యం విషమించి మరణించిందని పోలీసులు చెబుతున్నారు.
యమున తల్లిదండ్రులు ఈ విషయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “మా కూతురికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. కిడ్నీలు అమ్ముకోవాల్సిన అవసరం అసలు లేదు. ఆమెను మోసం చేశారు” అని కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబం న్యాయం కోరుతూ అధికారులను వేడుకుంటోంది.
కిడ్నీ రాకెట్‌లో కీలక పాత్ర పోషించిన బ్రోకర్లు కాకర్ల సత్య, పెళ్లి పద్మ, వెంకటేశ్వర్లు అని పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురి పైన గట్టి ఆధారాలు లభించాయని, త్వరలో వారిని అదుపులోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. మొత్తం వ్యవహారం మీద సిట్ దర్యాప్తు జరుగుతుందని సమాచారం.