పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచేందుకు, ముఖ్యంగా కుడి ఎడమ వైపుల కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు మొత్తం ₹542.85 కోట్ల భారీ నిధులను ఆమోదించింది. ఈ ఆమోదం వల్ల ప్రాజెక్టు ప్రాంతంలో రాకపోకలు సులభతరమవడంతో పాటు పనులకు కూడా వేగం అందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మొదటగా, కుడి వైపు కనెక్టివిటీ అభివృద్ధికి ప్రభుత్వం ₹117.80 కోట్లు కేటాయించింది. పోలవరం గ్రామం నుంచి స్పిల్‌వే, టన్నెల్స్ వరకు రహదారి నెట్వర్క్‌ను విస్తరించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. ఇప్పటి వరకూ ఈ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు పరిమితంగా ఉండడం వల్ల పనుల వేగం ప్రభావితం అవుతుందని నిపుణులు అంటున్నారు. కొత్త రోడ్లు నిర్మాణం పూర్తికాకానే కార్మికులు, యంత్రాంగం సులభంగా చేరుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
అలాగే, ఎడమ వైపు రవాణా సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం మరో ₹217.55 కోట్లు మంజూరు చేసింది. Gap–I నుంచి PIPLMC వరకు 21 కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మాణం ఈ మొత్తంతో చేపట్టనున్నారు. ఈ మార్గం ప్రాజెక్టు పనులకు కీలకమైనదే కాకుండా స్థానిక గ్రామాల మధ్య రాబోయే రోజుల్లో ప్రధాన కనెక్టివిటీగా మారనుంది. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న తాత్కాలిక రహదారులు వర్షాకాలంలో తీవ్రంగా దెబ్బతినడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యేవి. కొత్త రహదారులతో ఈ సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇక పురుషోత్తపట్నం వద్ద ఉన్న గండి పోషమ్మ తల్లి ఆలయ ప్రాంతంలో రక్షణ, భద్రతా పనుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ₹207.50 కోట్లు కేటాయించింది. ప్రాజెక్టు పనుల ప్రభావంతో ఈ ప్రాంతం పాక్షికంగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెప్పడంతో ప్రభుత్వం ముందస్తు చర్యగా ఈ నిధులను విడుదల చేసింది. ఆలయ ప్రాంగణం, సమీప ప్రాంతాల రక్షణ గోడలు, మట్టి బలపరిచే కార్యక్రమాలు ఈ నిధులతో చేపట్టబడతాయి.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగుతున్న తరుణంలో ఈ కనెక్టివిటీ పనుల మంజూరు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. రోడ్ల నిర్మాణం పూర్తికాగానే ఇంజనీరింగ్ బృందాలు, మిషనరీలు, సామాగ్రి రవాణా వేగవంతమై ప్రాజెక్టు పురోగతి మరింత వేగం అందుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలకు సైతం మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయని అధికారులు తెలిపారు.
ఈ మొత్తమంతా ఆమోదం పొందడంతో పోలవరం ప్రాజెక్టు కీలక దశలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాల్లో పోలవరమ్ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుండటంతో ప్రభుత్వం కనెక్టివిటీ, భద్రతా పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.