Delhi: రాయలసీమ హార్టికల్చర్ హబ్ లక్ష్యం నుంచి పోలవరం వరకు.. ఢిల్లీలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కీలక వ్యాఖ్యలు!
Delhi: తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పార్లమెంట్‌లో చర్చించాల్సిన జాతీయ అంశాలు, మహిళా రిజర్వేషన్ బిల్లు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి, సైబర్ నేరాలు వంటి పలు కీలక విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననంపై కఠిన చట్టం అవసరం: లావు..
36 నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి సహకరించాలి: ఎంపీ లావు..
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పార్లమెంట్‌లో చర్చించాల్సిన జాతీయ అంశాలు, మహిళా రిజర్వేషన్ బిల్లు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి, సైబర్ నేరాలు వంటి పలు కీలక విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమను దేశంలోనే ప్రముఖ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఉద్యానవన రంగ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు రావాలని కోరినట్లు చెప్పారు. రైతులకు అధిక ఆదాయం వచ్చేలా హార్టికల్చర్ రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననం, తప్పుడు ప్రచారం, అసత్య సమాచార వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై పార్లమెంట్‌లో విస్తృత చర్చ జరగాలని, అవసరమైతే కఠిన చట్టాన్ని తీసుకురావాలని సూచించారు. అదే విధంగా రోజురోజుకు పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు కూడా సమర్థవంతమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.
షెల్ కంపెనీలు, హవాలా లావాదేవీల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. 2027 మార్చి నాటికి తొలి విడత పనులు పూర్తవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం 36 నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి సుమారు రూ.60 వేల కోట్ల వ్యయం అవుతుందని, 2029 ఎన్నికల నాటికి అన్ని ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ఈ ప్రాజెక్టులు వేగంగా పూర్తవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా జలశక్తి మంత్రిత్వ శాఖ పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల వ్యయంలో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరిస్తే పనులు మరింత వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
మహిళా సాధికారతకు మహిళా రిజర్వేషన్ బిల్లు ఎంతో కీలకమని పేర్కొన్న ఎంపీ, ఆ బిల్లు తప్పకుండా ఆమోదం పొందాలని ఆకాంక్షించారు. గతంలో కాంగ్రెస్ ఉచ్చులో పడి కొన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయని విమర్శించారు. అయితే ఈసారి అన్ని విపక్ష పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమరావతి అంశంపై కూడా స్పందించిన లావు శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర ప్రభుత్వం అమరావతిని నోటిఫై చేసిన సందర్భంలో దానిని వ్యతిరేకించిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు.
రాష్ట్రాభివృద్ధి, వ్యవసాయం, నీటిపారుదల, మహిళా సాధికారత, డిజిటల్ భద్రత వంటి అంశాలపై సమగ్ర దృష్టితో కేంద్రం సహకరిస్తే ఆంధ్రప్రదేశ్ మరింత వేగంగా అభివృద్ధి సాధిస్తుందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.
Tags
Be the first to react