వంద రోజుల పాలనలోనే విప్లవాత్మక మార్పులు.. ఏపీ స్కూళ్లలో విద్యా ప్రమాణాలను చూసి కేంద్ర మంత్రి ఫిదా!
ఆంధ్రప్రదేశ్ విద్యారంగం అభివృద్ధికి, నూతన విద్యావిధానాల అమలుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక శ్రద్ధతో చేస్తున్న కృషి అభినందనీయమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు లోకేశ్ చూపిస్తున్న చొరవను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.
- భోగాపురం పీఎంశ్రీ మోడల్ స్కూల్ను సందర్శించిన కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, లోకేశ్..
- తరగతి గదిలో విద్యార్థులతో సరదాగా ముచ్చటించి వారి నైపుణ్యాలను పరిశీలించిన మంత్రులు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సమూల మార్పులకు, నూతన విద్యావిధానాల విజయవంతమైన అమలుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక శ్రద్ధతో చేస్తున్న కృషి ఎంతగానో అభినందనీయమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. రాష్ట్రంలో పాఠశాల స్థాయి నుంచే విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి పెంచేందుకు లోకేశ్ చూపిస్తున్న చొరవ, పట్టుదలను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. మంగళవారం ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురం మండల కేంద్రంలోని ప్రతిష్టాత్మక పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్ను (PM SHRI AP Model School) రాష్ట్ర మంత్రి నారా లోకేశ్తో కలిసి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా సందర్శించారు. ఈ సంయుక్త పర్యటనలో భాగంగా పాఠశాలలో విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ఆధునిక విద్యాబోధన పద్ధతులు, డిజిటల్ మౌలిక వసతులు మరియు ల్యాబ్స్ను మంత్రులిద్దరూ క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ప్రాంగణానికి చేరుకున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్కు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సి. పార్వతి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు సాంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం పలికారు. స్కూల్ ఎన్సీసీ విద్యార్థులు, పోలీసుల నుండి గౌరవ వందనం (Guard of Honour) స్వీకరించిన అనంతరం మంత్రులు పాఠశాల ప్రాంగణమంతా కలియతిరిగి క్లాస్ రూమ్లను పరిశీలించారు. ఈ పర్యటన టెక్నాలజీ, సంప్రదాయాల మేళవింపుగా సాగింది. విద్యాబోధనలో ఉపాధ్యాయులు సరికొత్తగా వినియోగిస్తున్న పలు ఆధునిక ఉపకరణాలను మంత్రులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రాథమిక స్థాయి విద్యార్థుల ఆటపాటల విద్య కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన 'జాదూ పిఠారా' (Jaadui Pitara) లెర్నింగ్ కిట్ను కేంద్ర మంత్రి నిశితంగా గమనించగా, ఏపీలోని స్కూళ్లలో దాని పనితీరు మరియు సాధిస్తున్న ఫలితాలను మంత్రి లోకేశ్, విద్యాశాఖ సిబ్బంది కేంద్ర మంత్రికి ప్రత్యక్షంగా వివరించారు.
దాంతో పాటు పాఠశాలలో విద్యార్థుల నిరంతర ప్రగతిని శాస్త్రీయంగా నమోదు చేసే సరికొత్త ప్రోగ్రెస్ కార్డులు, అసెస్మెంట్ బుక్లెట్లను మంత్రి లోకేశ్ స్వయంగా కేంద్ర మంత్రికి చూపించి రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధాన శైలిని వివరించారు. సమాజంలో విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు వీలుగా, విలువలతో కూడిన నైతిక విద్య కోసం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల ఆధారంగా ముద్రించిన ప్రత్యేక పుస్తకాల ప్రాధాన్యత గురించి లోకేశ్ ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి పరిచయం చేశారు. అలాగే నిరుపేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న 'సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్'లోని నాణ్యమైన టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, మూడు జతల యూనిఫాం, షూ, సాక్స్ మరియు సరికొత్త స్కూల్ బ్యాగ్ వంటి వస్తువుల నాణ్యతను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా పరిశీలించి, ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని హర్షం వ్యక్తం చేశారు.
లీప్ డ్యాష్బోర్డుపై ప్రత్యేక ఆసక్తి..
రాష్ట్ర విద్యాశాఖ పనితీరును పర్యవేక్షించేందుకు రూపొందించిన 'లీప్' డ్యాష్బోర్డును కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆసక్తిగా తిలకించారు. ఈ డ్యాష్బోర్డు ద్వారా విద్యార్థుల నమోదు, హాజరు, అభ్యసన ఫలితాలు, మధ్యాహ్న భోజన పథకం, డ్రాపౌట్లు, అధికారుల తనిఖీలు వంటి అనేక అంశాలను రియల్ టైంలో పర్యవేక్షించవచ్చని మంత్రి లోకేశ్ వివరించారు.
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న స్మార్ట్ కిచెన్ల వ్యవస్థపై రూపొందించిన వీడియోను మంత్రులు వీక్షించారు. కడపలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన స్మార్ట్ కిచెన్ గురించి కేంద్ర మంత్రికి లోకేశ్ విశదీకరించారు. అనంతరం స్పోర్ట్స్ రూమ్, స్కిల్ ల్యాబ్లను సందర్శించి, అక్కడ విద్యార్థులు పైథాన్ లాంగ్వేజ్తో రూపొందించిన ఒక అప్లికేషన్ను పరిశీలించి అభినందించారు.
విద్యార్థులతో సరదాగా ముచ్చట్లు...
అనంతరం మంత్రులిద్దరూ 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థుల మధ్య కూర్చున్నారు. 'ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా' అనే పాఠ్యాంశంపై రూపొందించిన క్లిక్కర్ వీడియోను వీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి విద్యార్థులతో సరదాగా సంభాషించారు. చాణక్య అనే విద్యార్థిని "చాణక్యుడు కింగా? కింగ్ మేకరా?" అని ప్రశ్నించగా, ఆ విద్యార్థి 'కింగ్ మేకర్' అని చురుగ్గా సమాధానమిచ్చాడు. మరో విద్యార్థిని పాఠ్యాంశాల్లో సందేహాలు వస్తే ఎవరిని అడుగుతావని ప్రశ్నించగా, తన సోదరుడిని అడుగుతానని చెప్పాడు.
ఈ నేపథ్యంలో, విద్యార్థుల సౌలభ్యం కోసం బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్స్ను ప్రవేశపెట్టామని మంత్రి లోకేశ్ వివరించారు. విద్యార్థి స్థాయి ఆధారంగా బోధించే 'పాల్' ల్యాబ్ను కూడా మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా తమ పేర్లతో 3డీ ప్రింటింగ్తో రూపొందించిన బహుమతులను ఓ విద్యార్థి మంత్రులకు అందజేశాడు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి, చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు, జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు, ఇతర ఉన్నతాధికారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.