ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై సమీక్ష చర్యలు చేపట్టింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, జిల్లాల పేర్లు, సరిహద్దులు, ప్రధాన కార్యాలయాలు, మండలాల పరంగా వచ్చిన మార్పులపై రాష్ట్రం కార్యచరణ రూపొందిస్తోంది.
ఈ పరిణామాలను సమీక్షించేందుకు ఇటీవల ఏడుగురు మంత్రులతో కేబినెట్ ఉపసంఘం (సబ్ కమిటీ) ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, పి.నారాయణ, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల అంశాన్ని ప్రస్తావించారు. సబ్ కమిటీ నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాల పేర్లు, ప్రధాన కేంద్రాలు, సరిహద్దులు, డివిజన్లు, మండలాల అంశాలపై కమిటీ ఇప్పటివరకు ఎంతవరకు పరిశీలించింది అనే విషయం గురించి ఆయన వివరాలు కోరినట్లు సమాచారం. పౌరుల నుంచి వచ్చిన అభ్యర్థనలు, ఫిర్యాదులు పరిశీలించారా అని కూడా సీఎం అడిగినట్టు తెలుస్తోంది.
మునుపటి ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో కొన్ని లోపాలు చోటుచేసుకున్నాయని, వాటిని ఇప్పుడు సరిదిద్దాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఉపసంఘం ఈ నెల 12వ తేదీ తర్వాత మరోసారి సమావేశమై చర్చలు జరపనుంది. డిసెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
ఈ కమిటీ ప్రధానంగా జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులు, ముఖ్య కేంద్రాల మార్పులతో పాటు, రెవెన్యూ డివిజన్లు, మండలాల విభజనలపై సమగ్రంగా అధ్యయనం చేస్తోంది. ప్రజల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, అభ్యర్థనలు కూడా ఈ నివేదికలో ప్రతిబింబించనున్నాయి.
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి పలు ప్రాంతాల నుంచి డిమాండ్లు వచ్చాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో మార్కాపురం కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని గత కొంత కాలంగా ప్రజల అభ్యర్థనలున్నాయి.
యర్రగొండపాలెం, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉన్నది. దీనికి అనుగుణంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ కూడా ఇచ్చారు.
అన్నమయ్య జిల్లాలో రాజంపేటను ప్రధాన కేంద్రంగా చేయాలన్న ప్రజల కోరిక ఉన్నప్పటికీ, ప్రస్తుతం రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాకు నర్సాపురాన్ని కేంద్రంగా చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది, అయితే ప్రస్తుతం భీమవరం ప్రధాన కేంద్రంగా ఉంది.
అలాగే శ్రీసత్యసాయి జిల్లాలో హిందూపురాన్ని కేంద్రంగా చేయాలన్న అభ్యర్థనలు ఎక్కువగా వస్తున్నాయి. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఇదే కోరుతున్నారు. ప్రస్తుతం పుట్టపర్తి కేంద్రంగా ఉంది.
గత ప్రభుత్వం ఒక గిరిజన జిల్లా ఏర్పాటు చేస్తామన్న మాటనిస్తూ రెండు గిరిజన జిల్లాలను ప్రకటించింది. పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పడ్డాయి. అయితే మన్యం జిల్లా పేరును మార్చాలన్న డిమాండ్ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.