ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం త్వరలోనే అమలులోకి రానుంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, ఆడపిల్లలు మరియు ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు. ఇందుకోసం గుర్తింపు కార్డు ఆధారంగా ఐదు రకాల ఆర్టీసీ సర్వీసుల్లో ప్రయాణించేందుకు అవకాశం ఉండనుందని అధికారులు తెలిపారు.
ఈ పథకానికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను సిద్ధం చేసిన ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. అయితే, తాజాగా విశాఖపట్నంలో జరిగిన డిపో మేనేజర్ల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.
తిరుపతి – తిరుమల ఘాట్ రోడ్‌పై నడిచే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ పథకం వర్తించదని స్పష్టం చేశారు. భద్రతా కారణాలతో ఆ మార్గంలో ఉచిత ప్రయాణం అనుమతించదలచుకోలేదని వివరించారు. అయితే, ఎజెన్సీ ప్రాంతాల్లో ఘాట్ రోడ్ కాకుండా ఇతర మార్గాల్లో ఈ పథకం యథాతథంగా అమలవుతుందని తెలిపారు.
"స్త్రీ శక్తి పథకం కింద ఆగస్టు 15 నుంచి జీరో టికెట్ విధానాన్ని అమలు చేస్తాం" అని ఆర్టీసీ ఎండీ తెలిపారు. మహిళలు ఆధార్ లేదా గుర్తింపు కార్డును చూపించడం తప్పనిసరిగా చేయాలన్నారు. భవిష్యత్తులో ప్రత్యేక స్మార్ట్ కార్డులు జారీ చేసే యోచనలో ఉన్నామని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజూ సుమారు 15 లక్షల మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నా, ఈ పథకం ప్రారంభమైతే సంఖ్య 26 లక్షల దాకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. అదే సమయంలో ప్రయాణీకుల సంఖ్య పెరగడం వల్ల ఏర్పడే రద్దీకి తగిన ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టామని తెలిపారు.
పల్లెవెలుగు ఏసీ, సిటీ ఆర్డినరీ ఏసీ, ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే సేవలోకి రానున్నట్లు వెల్లడించారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీపై ఆర్థిక భారం పెరుగుతుందని అన్నారు. అయితే ఆ భారాన్ని ప్రభుత్వం భరించనుందని స్పష్టం చేశారు.
ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ, స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, ఎదురయ్యే సవాళ్లను అధిగమించి రాష్ట్రంలోని ప్రతి మహిళకు ప్రయోజనం కలిగేలా ఉచిత ప్రయాణం అందిస్తామని అన్నారు. రాష్ట్రానికి 1050 ఎలక్ట్రిక్ బస్సులు రావాల్సి ఉందని, వాటిలో మొదటి విడతగా 700 బస్సులు ఆరు నెలల్లో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.