ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖ ప్రజల కోసం ఒక ప్రత్యేక ప్రమాద బీమా పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాలసీ ద్వారా కేవలం సంవత్సరానికి ₹549 నుంచి ₹788 ప్రీమియం చెల్లించడం ద్వారా ₹10 లక్షల నుంచి ₹15 లక్షల వరకు బీమా కవరేజ్ పొందవచ్చు. 18 నుండి 65 ఏళ్ల మధ్య వయస్సు గల ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. రోడ్డు ప్రమాదాలు, పాము కాటు, పిడుగుపాటు, కరెంట్ షాక్, ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల వలన గాయాలు లేదా పక్షవాతం వంటి సందర్భాల్లో ఈ బీమా వర్తిస్తుంది. అయితే, సాధారణ మరణానికి ఈ బీమా వర్తించదు.
ఈ పాలసీని పొందేందుకు ముందుగా ₹200తో పోస్టాఫీసులో ఖాతా ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మీరు ఎంచుకున్న ప్రీమియాన్ని పోస్టుమాస్టర్‌కు చెల్లిస్తే పాలసీ అమల్లోకి వస్తుంది. ఒక్కసారిగా చెల్లించిన ప్రీమియం ఒక సంవత్సరం మాత్రమే చెల్లుబాటు అవుతుంది, తదుపరి సంవత్సరంలో మళ్లీ పాలసీని రిన్యూ చేసుకోవాలి. ఈ తక్కువ ప్రీమియంతో అధిక కవరేజ్ ఇచ్చే పథకం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో కీలకంగా మారుతోంది. ఇప్పటికే అనేక మంది ఈ పాలసీ ప్రయోజనాలు పొందుతున్నారు, ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఈ బీమా డబ్బు పెద్ద సహాయంగా నిలుస్తోంది.