గుంటూరు నగరంలోని ముఖ్యమైన శంకర్ విలాస్ వంతెన కూల్చివేత పనులు ఈ శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వంతెనపైకి భారీ వాహనాల రాకపోకలను ఆపేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి మిగిలిన అన్ని వాహనాల రాకపోకలను కూడా నిలిపి, పూర్తిగా మళ్లింపు మార్గాల్లోకి పంపనున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. వంతెన కూల్చివేత సమయంలో నగరంలో ట్రాఫిక్ రద్దీ లేకుండా ఉండేందుకు తాత్కాలికంగా కొత్త మార్గాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
అమరావతి రోడ్డు నుంచి ఎంటీబీ సెంటర్ వైపు వెళ్లే భారీ వాహనాలు, అమరావతి రోడ్డులోని చిల్లీస్ సెంటర్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డుమార్గం ద్వారా ప్రయాణించాలి. కార్లు, ఆటోలు, బైకులు మాత్రం అరండల్పేట, పీఎస్ నగర్, డొంక రోడ్డు, మూడు వంతెనల మీదుగానీ లేదా బ్రాడీపేట నుంచి కంకరగుంట వంతెన మార్గంలోగానీ వెళ్లవచ్చు. తిరుగు ప్రయాణానికీ ఇదే మార్గాలు వాడాలి.
ఎంటీబీ సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ వైపు వెళ్లే భారీ వాహనాలు రమేష్ ఆసుపత్రి రోడ్డుద్వారా కంకరగుంట వంతెన మార్గాన్ని ఉపయోగించాలి. పాఠశాలలు, కళాశాలల బస్సులు కూడా ఈ మార్గాన్నే అనుసరించాలి.
కోబాల్టుపేట, కృష్ణనగర్, చంద్రమౌళీనగర్, బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం ప్రాంతాల నుంచి మార్కెట్ వైపు వచ్చే వాహనాలు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ రోడ్డుగానీ లేదా బ్రాడీపేట 18వ లైన్‌లోని కంకరగుంట ఆర్‌యూబీ గానీ దాటి, కలెక్టర్ కార్యాలయం రోడ్డుమార్గం లేదా రమేష్ ఆసుపత్రి మార్గం ఉపయోగించాలి.
పట్టాభిపురం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వైపు వెళ్లేవారు కంకరగుంట వంతెన నుంచి ఎంటీబీ సెంటర్, అక్కడి నుంచి ప్రభుత్వ మహిళా కళాశాల, పల్లవి థియేటర్ మార్గం ద్వారా వెళ్లాలి.
లాడ్జి సెంటర్ నుంచి ఎంటీబీ సెంటర్ వైపు భారీ వాహనాలు అమరావతి రోడ్డులోని చిల్లీస్ సెంటర్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డుమీదుగా, ఆటోనగర్ దాటి బస్టాండ్ లేదా కంకరగుంట వంతెన మార్గాన్ని ఎంచుకోవాలి.
జిల్లా ప్రజలు, గుంటూరు నగరానికి వచ్చే వారు ముందుగానే ఈ మళ్లింపు మార్గాలను తెలుసుకోవాలని ఎస్పీ సూచించారు. అలాగే ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పక పాటించాలని, వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తాత్కాలిక మార్గాలను ఏర్పాటు చేశామని తెలిపారు.