రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ బాధ్యత పూర్తికాలేదని, నిజమైన పని ఇప్పుడే ప్రారంభమైందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. శుక్రవారం కాకినాడలోని జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ‘హలో లోకేశ్’ పేరిట నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి జేఎన్టీయూ ఈసీఈ మూడో సంవత్సరం విద్యార్థిని ప్రాప్తి యాంకర్‌గా వ్యవహరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులతో సూటిగా, స్నేహపూర్వకంగా మాట్లాడిన లోకేశ్, వారి సందేహాలు, ఆశయాలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు.
జీవితంలో తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని పేర్కొన్న నారా లోకేశ్, తన జీవితంలో పాదయాత్ర ఒక మైలురాయి లాంటి నిర్ణయమని చెప్పారు. ఆ పాదయాత్ర ద్వారానే కోట్లాది మంది ప్రజలు, ముఖ్యంగా యువత ఆశలు, ఆకాంక్షలు, సమస్యలను దగ్గరగా తెలుసుకునే అవకాశం లభించిందని తెలిపారు. ఆ సమయంలో నేర్చుకున్న అనుభవాలే ఇప్పుడు ప్రభుత్వ విధానాలకు పునాదిగా మారాయని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామని, ఇది మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణలో చూపించిన నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, క్లస్టర్ ఆధారిత అభివృద్ధి ద్వారా రాష్ట్రం మొత్తం సమానంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు.
విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో విద్యార్థుల పాత్ర కీలకమని లోకేశ్ అన్నారు. అందుకే ఇకపై ప్రతి నెలా విద్యార్థులతో నేరుగా సమావేశమై వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకునే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ను తేలిగ్గా తీసుకోకుండా సీరియస్‌గా పరిశీలించి, పాఠ్యప్రణాళికలు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల మెరుగుదలకు ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. సీఎస్ఆర్ తరహాలోనే పరిశ్రమలు కూడా పరిశోధన, ఆవిష్కరణలకు నిధులు కేటాయించేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. విద్య–పరిశ్రమల మధ్య బలమైన అనుసంధానం ఏర్పడితేనే యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు అందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
మనం ఎంత ఎత్తుకు ఎదిగినా నైతిక విలువలను మరచిపోకూడదని విద్యార్థులకు లోకేశ్ హితవు పలికారు. పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అదే సమయంలో నైతిక విలువలను బలంగా నాటేందుకు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును ప్రభుత్వ సలహాదారుగా నియమించామని తెలిపారు. ఆయనకు కేబినెట్ ర్యాంకు ఇచ్చినా, ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు తీసుకోకుండా సేవ చేస్తున్నారని గుర్తుచేశారు. ‘అమ్మకు చెప్పలేని పని మనం చేయకూడదు’ అనే చాగంటి మాట జీవితానికి మార్గదర్శకమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంలో విద్యార్థులంతా భాగస్వాములు కావాలని, వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నారా లోకేశ్ భరోసా ఇచ్చారు.