పసిడి మరోసారి ఆకాశం దిశగా దూసుకుపోతోంది. గ్లోబల్ వాణిజ్య రంగంలో ఉద్రిక్తతలు పెరిగిన వేళ, పెట్టుబడిదారుల దృష్టి సురక్షితమైన ఆస్తులపై పడటంతో బంగారం ధరలు చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ఈ ప్రభావంతో దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.1.03 లక్షల మార్కును అధిగమించి వినియోగదారులకు షాక్ ఇచ్చింది.
అంతర్జాతీయంగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న వాణిజ్య నిర్ణయాలు మార్కెట్లలో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్‌పై అదనంగా 25 శాతం సుంకం, అలాగే చిప్‌ల దిగుమతులపై 100 శాతం ట్యారిఫ్ విధించనున్నట్టు హెచ్చరించడం వాణిజ్య యుద్ధ భయాలను మరింత ముద్రగట్టింది. దీంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడి అవకాశంగా చూస్తూ భారీగా కొనుగోలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో న్యూయార్క్ స్పాట్ మార్కెట్‌లో బంగారం ఒక్క ఔన్సు ధర $3,379 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ బులియన్ మార్కెట్లలో బంగారం ధరలు ఊహించని స్థాయికి చేరాయి.
ఢిల్లీ బులియన్ మార్కెట్: ఒక్కరోజే రూ.3,600 పెరిగి 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,620
హైదరాబాద్ మార్కెట్: 10 గ్రాముల ధర రూ.1,03,000
బంగారం ధరల పెరుగుదలతో పాటు వెండి కూడా భారీగా ఎగిసింది. కిలో వెంది ధర రూ.1,500 పెరిగి, ప్రస్తుతం రూ.1.14 లక్షల వద్ద ట్రేడవుతోంది.
ధరల పెరుగుదలకు కారణాలు..
అమెరికా వాణిజ్య విధానాలు, సుంకాల పెంపు
వాణిజ్య యుద్ధ భయాలు
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న ఊహాగానాలు
డాలర్ విలువ బలహీనపడటం
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ, మరో మార్కెట్ విశ్లేషకుడు ప్రవీణ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, బంగారానికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.