అమెరికాలో తెలుగు విద్యార్థికి 30 నెలలు జైలు, 83 లక్షల ఫైన్ తో పాటు.. ఎదగటానికి ఎందుకురా తొందర.. నీ బతుకంతా చిందర వందర!

Indian Student Jailed US Tech Scam: మైక్రోసాఫ్ట్ టెక్ సపోర్ట్ ప్రతినిధుల పేరిట అమెరికాలోని ఒక వృద్ధుడిని బెదిరించి బంగారం కాజేసిన కేసులో భారత విద్యార్థి వెంకటేశ్వర చాగంరెడ్డికి యూఎస్ కోర్టు 30 నెలల జైలు శిక్ష విధించింది. బాధితుడికి రూ.83 లక్షల పరిహారంతో పాటు జైలు అనంతరం మూడేళ్ల పర్యవేక్షణను ఆదేశించింది. రెండోసారి నగదు తీసుకునేందుకు వెళ్లినప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఈ ఘటన, ఈజీ మనీ కోసం సైబర్ ముఠాల వలలో పడే విదేశీ విద్యార్థులకు గుణపాఠంగా మారింది.

అమెరికాలో తెలుగు విద్యార్థికి 30 నెలలు జైలు
అమెరికాలో తెలుగు విద్యార్థికి 30 నెలలు జైలు
  • చదువుకోవడానికి వెళ్లి జైలు పాలైన తెలుగు యువకుడు: రెండోసారి డబ్బు కోసం వెళ్లి పోలీసులకు అడ్డంగా బుక్!

  • మైక్రోసాఫ్ట్ ప్రతినిధుల పేరుతో భారీ మోసం: ఫెడరల్ అధికారుల ముసుగులో టెక్ స్కామ్ ఎలా చేశారంటే?!

  • అమెరికా కోర్టు కఠిన చర్యలు: 30 నెలల కారాగార వాసంతో పాటు మూడేళ్ల పర్యవేక్షణ.. విద్యార్థి భవిష్యత్తు నాశనం!

Indian Student Jailed US Tech Scam: ఉన్నత చదువులు చదివి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలనే కలలతో అమెరికా వెళ్లిన ఒక భారతీయ విద్యార్థి పెడదోవ పట్టి చివరకు కటకటాల పాలయ్యాడు. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో స్టూడెంట్ వీసాపై నివసిస్తున్న వెంకటేశ్వర చాగంరెడ్డి అనే యువకుడు టెక్ సపోర్ట్ స్కామ్‌లో నిందితుడిగా తేలడంతో యూఎస్ కోర్టు అతనికి 30 నెలల జైలు శిక్ష విధించింది. మైక్రోసాఫ్ట్ టెక్నికల్ సపోర్ట్ ప్రతినిధి పేరిట ఒక్లహోమాకు చెందిన ఒక వృద్ధుడిని మోసగించిన కేసులో అతన్ని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం, జైలు శిక్షతో పాటు బాధితుడికి దాదాపు రూ.83 లక్షలు ($100,000 పైమాటే) పరిహారంగా చెల్లించాలని, శిక్ష పూర్తయిన తర్వాత మరో మూడేళ్ల పాటు అధికారుల పర్యవేక్షణలో ఉండాలని ఆదేశించింది.

కంప్యూటర్ సమస్య పేరుతో మొదలైన బెదిరింపులు

ఈ కేసులో మోసం మొదలైన తీరు అత్యంత పకడ్బందీగా సాగింది. ఒక్లహోమాలో ఉంటున్న వృద్ధుడికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాము మైక్రోసాఫ్ట్ టెక్నికల్ సపోర్ట్ బృందం నుంచి మాట్లాడుతున్నామని, ఆయన కంప్యూటర్‌లో తీవ్రమైన చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయని భయపెట్టారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఫెడరల్ అధికారులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయిస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆ వృద్ధుడు తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు.

నగదును బంగారంగా మార్పించి దోపిడీ

బాధితుడిని మరింత నమ్మించేందుకు నిందితులు మరో ప్రమాదకరమైన ఎత్తుగడ వేశారు. చట్టపరమైన ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఆయన వద్ద ఉన్న నగదును వెంటనే బంగారంగా మార్చాలని, దర్యాప్తు కోసం ఇంటికి వచ్చే ఫెడరల్ అధికారికి ఆ బంగారాన్ని అప్పగించాలని సూచించారు. అధికారుల పేర్లు చెప్పి భయపెట్టడంతో నిజమేనని నమ్మిన ఆ వృద్ధుడు, వారు చెప్పినట్లే తన పొదుపు మొత్తాన్ని బంగారంగా మార్చి అప్పగించాడు.

అత్యాశే కొంపముంచింది – రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విద్యార్థి

ఒకసారి మోసం విజయవంతమైన తర్వాత నిందితుల అత్యాశ మరింత పెరిగింది. కొద్ది రోజుల వ్యవధిలోనే మళ్లీ అదే వృద్ధుడికి ఫోన్ చేసి ఇంకా అదనపు నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు తన కుటుంబ సభ్యులను సంప్రదించి, తాను సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నట్లు గ్రహించి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు పక్కా వ్యూహం పన్నారు. రెండోసారి డబ్బు, బంగారం కలెక్ట్ చేసుకోవడానికి బాధితుడి ఇంటికి వచ్చిన సమయంలో వెంకటేశ్వర చాగంరెడ్డిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.

స్టూడెంట్ వీసాదారులకు హెచ్చరిక – సైబర్ నేరాలపై అప్రమత్తత

విచారణ అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లోనే వెంకటేశ్వర చాగంరెడ్డిని కోర్టు దోషిగా తేల్చగా, తాజాగా శిక్షను ఖరారు చేసింది. అమెరికాలో ఇటీవల కాలంలో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మైక్రోసాఫ్ట్, ఫెడరల్ పోలీసులు, ఐఆర్‌ఎస్ (ట్యాక్స్) అధికారుల పేరుతో ఇలాంటి టెక్ సపోర్ట్ స్కామ్‌లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తక్కువ సమయంలో సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో లేదా సైబర్ ముఠాల మాటలు నమ్మి కొరియర్లుగా, మనీ మ్యూల్స్‌గా మారే విదేశీ విద్యార్థులకు ఈ కేసు ఒక తీవ్ర హెచ్చరికగా నిలుస్తోంది. ఒక్క తప్పుడు అడుగు కెరీర్‌ను, భవిష్యత్తును నాశనం చేస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Tags

Be the first to react

Latest