ఏపీలో వర్షాలపై హై అలర్ట్.. 13 జిల్లాలకు పిడుగులతో కూడిన వర్ష సూచన!

AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు, ఈదురుగాలుల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

AP Rain Alert Sept 14
AP Rain Alert Sept 14

ఏపీ వెదర్ అలర్ట్.. చెట్లు, హోర్డింగుల కింద ఉండొద్దని విపత్తుల సంస్థ సూచన..

40–50 కి.మీ వేగంతో ఈదురుగాలులు.. చెట్లు, హోర్డింగుల కింద ఉండొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు, ఈదురుగాలుల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్, ఉత్తర విదర్భ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

13 జిల్లాల్లో పిడుగులతో వర్షాలు

సోమవారం (సెప్టెంబర్ 14) మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

చెట్లు, హోర్డింగుల కింద ఉండొద్దు

పిడుగులు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా చెట్ల కింద, హోర్డింగుల వద్ద నిలబడకూడదని స్పష్టం చేసింది. గాలుల వేగం పెరిగే సమయంలో ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండి, అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.

పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం

ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే గణనీయమైన వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల మధ్య కృష్ణా జిల్లా పెనమలూరులో అత్యధికంగా 100.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో 97.6 మి.మీ., పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 94.2 మి.మీ., పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 90.8 మి.మీ., బాపట్ల జిల్లా మార్టూరులో 90.6 మి.మీ. వర్షపాతం నమోదైంది.

కోనసీమ జిల్లా అయినవిల్లిలో 89.6 మి.మీ., పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో 88.4 మి.మీ., ప్రకాశం జిల్లా అద్దంకిలో 85.4 మి.మీ., కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో 84.6 మి.మీ., గుంటూరు పశ్చిమ ప్రాంతంలో 84.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఆదివారం సాయంత్రం వరకు పలు చోట్ల వర్షాలు

ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా మెట్టక్కివలసలో 34.1 మి.మీ. వర్షపాతం నమోదైంది.

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో 33 మి.మీ., శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో 32.2 మి.మీ., విజయనగరం జిల్లా మల్లంపేటలో 31.2 మి.మీ., శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో 31 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

అప్రమత్తంగా ఉండాలని సూచన

అల్పపీడనం కదలికలు, వర్షాలు, గాలుల పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. రైతులు కూడా పొలాల్లో పనిచేసే సమయంలో వాతావరణ పరిస్థితులను గమనించాలని, పిడుగులు పడే సమయంలో చెట్లు లేదా విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని సూచించారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు స్థానిక అధికారుల సూచనలను పాటించాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.

Tags

Be the first to react

Latest