శ్రీవారి సేవలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: బ్రహ్మోత్సవాల వేళ టీటీడీ పక్కా మాస్టర్ ప్లాన్! కొత్త రూల్స్ ఇవే!
Tirumala Brahmotsavam 2026: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఈసారి భద్రత విషయంలో సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రించడం, అత్యవసర సమయాల్లో కమ్యూనికేషన్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా చూడటం లక్ష్యంగా అధునాతన టెక్నాలజీలను ప్రవేశపెడుతోంది.
- Devotional: కమ్యూనికేషన్ కోసం తొలిసారిగా జియో నెట్‌వర్క్ స్లైసింగ్ టెక్నాలజీ...
- తోపులాటల నివారణకు దిశల వారీగా ప్రత్యేక ఎగ్జిట్ ప్లాన్ అమలు..
Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విచ్చేసే కోట్లాది మంది భక్తుల రక్షణ మరియు రద్దీ నియంత్రణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈసారి సాంకేతికతకు పెద్దపీట వేసింది. ఉత్సవాల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అత్యవసర సమయాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), నెట్‌వర్క్ స్లైసింగ్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భద్రతను పటిష్ఠం చేసింది.
దేశంలోనే తొలిసారిగా 'నెట్‌వర్క్ స్లైసింగ్' టెక్నాలజీ..
బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన గరుడ సేవ రోజున నాలుగు మాడ వీధుల్లో సుమారు 3.5 లక్షల మందికి పైగా భక్తులు గుమిగూడే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది.
కమ్యూనికేషన్ నెట్‌వర్క్ భరోసా: అత్యంత భారీ రద్దీ ఉన్న సమయంలో సాధారణ మొబైల్ నెట్‌వర్క్‌లు జామ్ అవ్వడం, పోలీసుల వాకీటాకీల ఫ్రీక్వెన్సీలు ఓవర్‌ల్యాప్ కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనిని పరిష్కరించడానికి టీటీడీ, రవాణా దిగ్గజం రిలయన్స్ జియోతో కలిసి ప్రయోగాత్మకంగా ‘నెట్‌వర్క్ వితిన్ ది నెట్‌వర్క్’ ప్రాతిపదికన నెట్‌వర్క్ స్లైసింగ్ టెక్నాలజీని తీసుకొచ్చింది.
కమాండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం: దీని కోసం 30 ప్రత్యేక అధునాతన కమ్యూనికేషన్ పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. సాధారణ సిగ్నల్స్ నిలిచిపోయినా, ఇవి అంకితభావంతో కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానమై పనిచేస్తాయి. 11 కీలక సబ్-కంట్రోల్ పాయింట్ల వద్ద ఉన్నతాధికారులకు వీటిని అందజేస్తారు.
భక్తుల రద్దీని ఖచ్చితంగా లెక్కించనున్న ఏఐ కెమెరాలు..
మాడ వీధుల గ్యాలరీల్లో భక్తుల సంఖ్యను వేగంగా, ఖచ్చితంగా అంచనా వేసేందుకు మొదటిసారిగా ఏఐ (AI), సాఫ్ట్‌వేర్ ఆధారిత 'హెడ్ కౌంటింగ్' కెమెరాలను రంగంలోకి దించారు.
200 ప్రత్యేక కెమెరాలతో గ్రిడ్ సిస్టమ్: గ్యాలరీల్లో దాదాపు 200 ఏఐ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తం గ్యాలరీలను వివిధ గ్రిడ్లుగా విభజించి, ఏ గ్రిడ్‌లో ఎంతమంది భక్తులు ఉన్నారో ఈ కెమెరాలు రియల్ టైంలో కమాండ్ సెంటర్‌కు సమాచారం అందిస్తాయి.
ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లింపు: ఏదైనా ఒక గ్యాలరీ సామర్థ్యానికి మించి నిండిపోతే, వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై భక్తులను ప్రమాద రహిత ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తారు.
తోపులాటల నివారణకు దిశల వారీగా కొత్త ఎగ్జిట్ ప్లాన్..
గ్యాలరీల నుంచి శ్రీవారి దర్శనం లేదా వాహన సేవ అనంతరం భక్తులు ఒకేసారి బయటకు వచ్చే సమయంలో తొక్కిసలాటలు జరగకుండా టీటీడీ పక్కా ప్లాన్ రూపొందించింది.
ప్రత్యేక ర్యాంప్‌లు, ట్రాన్స్‌పోర్ట్ కనెక్టివిటీ:
ఏ మాడ వీధిలో ఉన్న భక్తులు అదే దిశలో వెళ్లేలా ప్ర నిష్క్రమణ దారులను నిర్దేశించారు. ముఖ్యంగా దక్షిణ మాడ వీధి భక్తుల కోసం ఎస్-3 గేట్ వద్ద ప్రత్యేక ర్యాంప్ నిర్మించారు. ఇక్కడి నుంచి నేరుగా భక్తులు ఆర్టీసీ బస్సులను అందుకొని తిరుపతి లేదా తిరుమల బస్టాండ్‌కు సులభంగా చేరుకోవచ్చు.
3,000 సీసీ కెమెరాలు, 5,300 మందితో మెగా బందోబస్తు..
మొత్తం తిరుమల కొండపై నిఘా కోసం 3,000 సీసీ కెమెరాలను అమర్చారు. అలిపిరి టోల్‌గేట్, నడక మార్గాల వద్ద ఫేషియల్ రికగ్నిషన్ (విజిటర్ల ముఖాలను గుర్తించే సాఫ్ట్‌వేర్), ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను అందుబాటులోకి తెచ్చారు.
విజిలెన్స్ మరియు ఏపీ పోలీసు సిబ్బంది కలిపి మొత్తం 5,300 మందితో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. తిరుమలలో కేవలం 4,600 వాహనాలకు మాత్రమే పార్కింగ్ సామర్థ్యం ఉన్నందున, పరిమితి దాటిన వెంటనే తిరుపతిలోని ఏడు రద్దీ లేని ప్రత్యామ్నాయ పార్కింగ్ స్థలాలకు వాహనాలను మళ్లించనున్నారు.
Tags
Be the first to react