ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్తనపై వరుస వివాదాలు తలెత్తుతున్నాయి. తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై అటవీ సిబ్బందితో జరిగిన ఘర్షణ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేయగా, తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా స్పందించారు.
అటవీ అధికారులపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యేపై వెంటనే కేసు నమోదు చేయాలని పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల విధుల్లో జోక్యం చేసుకునేవారిని ఎవ్వరినీ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. ఇక ఫారెస్ట్ అసోసియేషన్ నేతలు కూడా ఘర్షణ ఘటనపై మండిపడి, ఎమ్మెల్యేను పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఫారెస్ట్ సిబ్బంది ఆరోపణల ప్రకారం – చెక్‌పోస్ట్ వద్ద తమ వాహనాన్ని ఎమ్మెల్యే ఆపి దాడి చేసినట్లు తెలిపారు. ఫారెస్ట్ అధికారుల వాహనాన్ని స్వాధీనం చేసుకుని రాత్రంతా తిప్పారని, ఫారెస్ట్ గార్డ్ గురవయ్యపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని ఆరోపించారు. దీంతో వివాదం మరింత ముదిరి, పవన్ కళ్యాణ్ హెచ్చరికలు, ఫారెస్ట్ అసోసియేషన్ నిరసనలతో ఈ వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.