క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే మ్యాచ్‌లలో భారత్–పాక్ పోరు అగ్రస్థానంలో ఉంటుంది. రాజకీయ ఉద్రిక్తతలు, సరిహద్దు సమస్యలు ఉన్నా కూడా ఈ రెండు దేశాల మధ్య జరిగే ప్రతి పోరు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. ఈసారి ఆసియా కప్ UAEలో జరగనున్న నేపథ్యంలో భారత్–పాక్ జట్లు తలపడటం ఖాయం కావడంతో అభిమానుల్లో మిశ్రమ స్పందనలు కనిపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది – భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగవు. అంటే మన జట్టు పాకిస్థాన్‌లోకి వెళ్లి ఆడదు, అలాగే వాళ్ల జట్టు భారత్‌లో ఆడదు. అయితే ICC లేదా ACC నిర్వహించే అంతర్జాతీయ పోటీల్లో న్యూట్రల్ వేదిక ఉంటే అందులో పాల్గొనడంలో ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. దీంతో ఆసియా కప్‌లో భారత్–పాక్ జట్ల పోరు తప్పనిసరిగా జరుగుతుందని స్పష్టమైంది.
ఈ వార్తతో క్రికెట్ ప్రేమికులలో ఉత్సాహం నెలకొన్నా, మరోవైపు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది అభిమానులు: “క్రికెట్‌కు, క్రీడలకు రాజకీయాలకు సంబంధం ఉండకూడదు. ఇది కేవలం ఆట మాత్రమే” అని చెబుతున్నారు. మరికొందరు మాత్రం: “మన సైనికులు సరిహద్దులో ప్రాణత్యాగం చేస్తుంటే, డబ్బుల కోసం పాక్‌తో ఆడటం తగదు” అని విమర్శిస్తున్నారు.
భారత్–పాక్ మ్యాచ్‌లు ఖరారవ్వడంతో BCCIపై విమర్శల జల్లు కురుస్తోంది. “జవాన్ల త్యాగాలను మర్చిపోయారా?” “డబ్బుల కోసం పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడతారా?” “మాకు ఆ మ్యాచ్‌లు చూడాలనే ఉత్సాహం లేదు” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు. కొందరు #BoycottIndVsPak అనే హ్యాష్‌ట్యాగ్‌లతో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
భారత్–పాక్ పోరు ఎందుకింత స్పెషల్ అనేది వేరే చెప్పనవసరం లేదు. క్రీడాస్పూర్తి కంటే మించిన ప్రతిష్టాత్మకత ఈ మ్యాచ్‌లో ఉంటుంది. ఆటగాళ్లు మైదానంలో ఒకే ఒక్క బంతి, ఒక్క రన్ కోసం ప్రాణం పెట్టి ఆడతారు. రెండు దేశాల కోట్లాది అభిమానులు ఈ పోరును కళ్లారా చూడటానికి తెగ ఆసక్తి చూపుతారు. అందుకే క్రికెట్ ప్రపంచంలో భారత్–పాక్ మ్యాచ్‌ను “మినీ వరల్డ్ కప్” అని కూడా వ్యవహరిస్తారు.
BCCIపై వచ్చిన విమర్శల్లో, భారత్–పాక్ మ్యాచ్‌లు జరిగితే టికెట్ కలెక్షన్లు, స్పాన్సర్‌షిప్‌లు, టీవీ హక్కుల ద్వారా బోర్డుకు భారీ ఆదాయం వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, ఇది డబ్బు వర్షం కురిపించే మ్యాచ్. అందుకే BCCIపై “ఆర్థిక ప్రయోజనాల కోసం పాకిస్థాన్‌తో ఆడుతున్నారు” అనే ఆరోపణలు వస్తున్నాయి.
క్రికెట్ అనేది అభిమానులకి కేవలం ఆట మాత్రమే కాదు – అది ఒక భావోద్వేగం. మరికొందరు అయితే “మ్యాచ్ జరగకపోవడమే గౌరవం” అని అభిప్రాయపడుతున్నారు.