ఆంధ్రప్రదేశ్‌లో వేలాది మంది అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ–2025 మెరిట్ జాబితా విడుదల కానుంది. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
మెరిట్ జాబితాను డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు జిల్లాల డీఈఓ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు వారి వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్లు జారీ చేస్తారు. అనంతరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, తాజాగా పొందిన కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌పోర్ట్ ఫొటోలు తీసుకురావాలి. అంతకుముందే తమ సర్టిఫికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం తప్పనిసరి.
నిర్దేశిత సమయంలో వెరిఫికేషన్‌కు హాజరుకాని వారు తమ అవకాశాన్ని కోల్పోతారని, ఆ స్థానంలో తర్వాతి అభ్యర్థికి అవకాశం దక్కుతుందని అధికారులు స్పష్టం చేశారు.
అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని దళారులు చేసే తప్పుడు వాగ్దానాలు, సోషల్ మీడియాలో వ్యాపించే వదంతులను నమ్మొద్దు అని ప్రభుత్వం హెచ్చరించింది. నియామకాలు పూర్తిగా పారదర్శకంగా, మెరిట్ ఆధారంగానే జరుగుతాయని స్పష్టం చేసింది.