సాధారణంగా మనం కలుషితమైన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు, గుండె దెబ్బతింటాయని మాత్రమే అనుకుంటాం. కానీ, ఇప్పుడు వైద్య నిపుణులు ఒక షాకింగ్ నిజం వెల్లడించారు. మనం పీల్చే ఈ కలుషిత గాలి కేవలం గుండె, ఊపిరితిత్తులకే కాదండోయ్.. కీళ్లను సైతం తీవ్రంగా దెబ్బతీసి, చివరికి శాశ్వత వైకల్యానికి దారితీసే రుమటాయిడ్ ఆర్థరైటిస్ (కీళ్లవాతం) వంటి వ్యాధులకు కారణమవుతోందట!
ఇప్పటివరకు ఈ కీళ్లవాతం (RA) అనేది ఎక్కువగా జన్యుపరమైన కారణాలతో (Genetic Reasons) ముడిపడి ఉందని భావించేవారు. కానీ ఇప్పుడు వాయు కాలుష్యం కారణంగా కూడా ఈ వ్యాధి ప్రబలుతోందని వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే, మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ (Immune System) పొరపాటున, వేరే వాటిపై దాడి చేయాల్సింది పోయి.. సొంత కణజాలంపైనే దాడి చేస్తుంది. ఇది ఎక్కువగా కీళ్లపై దాడి చేయడంతో..
కీళ్లలో తీవ్రమైన నొప్పి, వాపు, బిగుసుకుపోవడం (Stiffness) వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఢిల్లీలోని ద్వారకలో జరిగిన ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ 40వ వార్షిక సదస్సు (ఐరాకాన్ 2025)లో నిపుణులు ఈ కీలక విషయాలను వెల్లడించారు.
గాలిలో ఉండే అతి సూక్ష్మ ధూళి కణాలు, ముఖ్యంగా పీఎం 2.5 (PM 2.5) శరీరంలోకి ప్రవేశించడం ద్వారా ఈ ప్రక్రియ మొదలవుతోంది. డాక్టర్ ఉమా కుమార్ (ఢిల్లీ ఎయిమ్స్ రుమటాలజీ విభాగాధిపతి) మాటల్లో: "గాలిలోని ఈ చిన్న కణాలు శరీరంలోకి వెళ్లి తీవ్రమైన వాపు ప్రక్రియలను (ఇన్‌ఫ్లమేషన్) ప్రేరేపిస్తున్నాయి.
దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించి కీళ్లను దెబ్బతీయడం మొదలుపెడుతోంది. వంశపారంపర్యంగా ఎలాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధుల చరిత్ర లేనివారు కూడా కాలుష్య ప్రాంతాల్లో నివసించడం వల్ల ఈ కీళ్లవాతం బారిన పడుతున్నారు. ఇది మనం ఇక ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి!"
అంటే, మీ కుటుంబంలో ఎవరికీ ఆర్థరైటిస్ లేకపోయినా, మీరు కలుషితమైన ప్రాంతంలో ఉంటే ప్రమాదంలో ఉన్నట్లే. "అధిక పీఎం 2.5 కాలుష్యానికి గురైన రోగులలో వ్యాధి చాలా వేగంగా ముదురుతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం తగ్గడం కూడా ఈ సమస్యను మరింత జఠిలం చేస్తోంది."
భారత్‌లో ఇప్పటికే సుమారు 1 శాతం జనాభా ఈ వ్యాధితో బాధపడుతుండగా, కాలుష్యం కారణంగా ఈ సంఖ్య గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు ప్రస్తుతం శాశ్వత నివారణ లేదు. ఈ వ్యాధిని జీవితాంతం మందులతో నియంత్రించాల్సి ఉంటుందని డాక్టర్లు గుర్తుచేశారు. అందుకే, ఈ వ్యాధి రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
ఈ ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోవడానికి నిపుణులు ప్రభుత్వాలకు కొన్ని కీలక సూచనలు చేశారు:
కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి.
ప్రజల్లో ఈ విషయంపై అవగాహన పెంచాలి.
ప్రమాదంలో ఉన్నవారికి ముందస్తు పరీక్షలు నిర్వహించాలి.
మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలంటే, గాలి కాలుష్యాన్ని మనం సామాజిక సమస్యగా గుర్తించి, దాన్ని తగ్గించడానికి కృషి చేయాలి.