ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోంది. ఆయన ఒకే ఏడాది పాలనలోనే పెట్టుబడులను ఆకర్షించే వాతావరణం సృష్టించి, పరిశ్రమల రంగంలో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపారు. పారదర్శక పాలన, వేగవంతమైన నిర్ణయాలు పెట్టుబడిదారులకు ఇచ్చిన నమ్మకం ఫలితంగా అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి సారిస్తున్నాయి. పరిశ్రమల అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల ఉపాధి అవకాశాల సృష్టి దిశగా ఆయన చేపట్టిన చర్యలు ఫలితమిస్తున్నాయి.
ఇలాంటి అభివృద్ధి క్రమంలోనే అనంతపురం జిల్లా కి మరో మంచి శుభవార్త వచ్చింది. ప్రముఖ రేమండ్ గ్రూప్ భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ అనంతపురం జిల్లాలోని గుడిపల్లి మరియు టెకులోడు ప్రాంతాల్లో రెండు ప్రధాన పరిశ్రమలను స్థాపించడానికి సిద్ధమైంది. మొత్తం ₹943 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులు రూపుదిద్దుకోనున్నాయి.
గుడిపల్లిలో ₹430 కోట్లతో ఆటో భాగాల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ యూనిట్ ప్రారంభమైతే 4,096 మంది యువకులకు ఉద్యోగాలు లభించనున్నాయి. అదే విధంగా, టెకులోడులో ₹510 కోట్లతో ఏరోస్పేస్ యూనిట్ ను స్థాపించనున్నారు. దీని ద్వారా మరిన్ని 1,400 ఉద్యోగాలు కలుగనున్నాయి.
ఈ రెండు ప్రాజెక్టులు ప్రారంభమైతే అనంతపురం జిల్లా పరిశ్రమల రంగంలో కొత్త ఊపును అందుకుంటుంది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. చిన్న వ్యాపారాలు, సాంకేతిక నిపుణులు, కూలీలకు కూడా కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి.
రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించిందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తోందని వారు తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్థానిక ప్రజలు ఈ పెట్టుబడిని స్వాగతిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయాలు మెరుగుపడతాయని, యువతకు కొత్త ఆశలు కలుగుతున్నాయని అభిప్రాయాలను తెలిపారు.