జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్, రాజ్యసభ మాజీ సభ్యుడు సత్యపాల్ మాలిక్ మంగళవారం (ఆగస్టు 5) కన్నుమూశారు. ఆయన వయస్సు 79 ఏళ్లు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌కు చెందిన ప్రముఖ జాట్ నేత అయిన మాలిక్ విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1974లో చౌధరి చరణ్ సింగ్ నేతృత్వంలోని భారతీయ క్రాంతి దళ్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఆ తరువాత రాజ్యసభ సభ్యుడిగా, తర్వాత జనతాదళ్ తరఫున అలీఘర్ నుంచి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. తన రాజకీయ జీవితం మొత్తం ఆయన కాంగ్రెస్, లోక్‌దళ్, సమాజ్‌వాది పార్టీ లాంటి అనేక పార్టీలతో పని చేశారు.
2017లో బీహార్ గవర్నర్‌గా నియమితులైన మాలిక్, కొంతకాలం ఒడిశా గవర్నర్ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. 2018 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా నియమితులైన ఆయన పదవీకాలంలోనే ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎత్తివేసి, జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది CRPF jawans ప్రాణాలు కోల్పోయిన సమయంలో మాలిక్ గవర్నర్‌గా ఉన్నారు.
జమ్మూ కాశ్మీర్‌లో తన పదవీకాలం పూర్తి చేసిన అనంతరం ఆయన గోవా, మేఘాలయల గవర్నర్‌గా సేవలందించారు.