ఫ్రాన్స్‌లోని పుయ్-డి-డోమ్ ప్రాంతంలో ఉన్న శాంతమైన పట్టణం అంబర్ట్ (Ambert) జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేస్తోంది. మెరుగైన జీవనోపాధి కోసం ప్రజలు పెద్ద పట్టణాల వైపు తరలిపోతుండటంతో 19వ శతాబ్దం నుంచి ఈ ప్రాంత జనాభా తగ్గిపోతోంది. ప్రస్తుతం కేవలం 6,500 మంది మాత్రమే నివసిస్తున్న ఈ ప్రాంతాన్ని తిరిగి చైతన్యవంతం చేయాలని అధికారులు ఐదేళ్ల ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా కేవలం రూ.100కి ఇల్లు అమ్మే బంపర్ ఆఫర్‌ను ప్రారంభించారు.
ఈ ఆఫర్ ద్వారా అక్కడి శతాబ్దాల నాటి ఖాళీ భవనాలను కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది. అయితే, కొనుగోలుదారులు ఆ ఇంటిని పూర్తిగా పునరుద్ధరించాల్సి ఉంటుంది. దీని ఖర్చు సుమారు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా. ఇల్లు కొనుగోలు చేసే వారికి కనీసం మూడు సంవత్సరాల పాటు అక్కడే నివసించాల్సి ఉంటుంది. ఫ్రెంచ్ భాష తెలియకపోయినా, స్థానికులతో కమ్యూనికేషన్ చేయగలగడం అవసరం. ఫ్రాన్స్ పౌరులతో పాటు ఇతర దేశాలవారు కూడా ఇక్కడ ఇల్లు కొనుగోలు చేయొచ్చు. పునరుద్ధరణ కోసం ప్రభుత్వం తక్కువ వడ్డీకే రుణాలు, గ్రాంట్లు అందిస్తోంది.
ఈ పథకం ద్వారా స్థానిక పాఠశాలలు, వ్యాపారాలు అభివృద్ధి చెందడమే కాకుండా, పట్టణం జనాభా కూడా మళ్లీ పెరుగుతుందన్న ఆశతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఇది ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడమే కాకుండా, వారసత్వ భవనాలను కాపాడే దిశగా కూడ ఒక మంచి ప్రయత్నం.