జీడిపప్పు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన ఆహార పదార్థం. ఇందులో మెగ్నీషియం, జింక్, ఐరన్, పొటాషియం, విటమిన్ K, విటమిన్ E, విటమిన్ B6, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తిని అందించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే ఎముకలకు బలం ఇచ్చి, నరాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ కారణంగానే జీడిపప్పును ఒక మంచి పోషకాహారంగా పరిగణిస్తారు.
కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు జీడిపప్పును తినొచ్చా లేదా అనేది చాలా మందికి సందేహం. వాస్తవానికి, కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు జీడిపప్పును మితంగా తినొచ్చు. ఎందుకంటే జీడిపప్పులో ఉండే పోషకాలు ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్)ను తగ్గించడంలో, హెచ్డీఎల్ (మంచి కొలెస్ట్రాల్)ను పెంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
అయితే జీడిపప్పును ఎక్కువగా తినడం మంచిది కాదు. జీడిపప్పులో మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ శరీరానికి మేలు చేస్తాయి కానీ, అతిగా తింటే కడుపుబ్బరం, మలబద్ధకం, బరువు పెరగడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి కొలెస్ట్రాల్ ఉన్నవారు జీడిపప్పును పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి.
జీడిపప్పులో ఉన్న విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అనేక లాభాలను ఇస్తాయి. రోజూ కొద్దిగా తీసుకుంటే శరీరానికి కావలసిన శక్తి వస్తుంది. ఎముకల బలాన్ని పెంచడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే కండరాల పనితీరు, నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
కానీ జీడిపప్పులో క్యాలరీలు, కొవ్వులు అధికంగా ఉండటం వల్ల, ఎక్కువ మొత్తంలో తింటే శరీరానికి నష్టం కలుగుతుంది. బరువు పెరగడమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల జీడిపప్పును అతిగా తినకుండా, మితంగా తీసుకుంటేనే పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.