మచిలీపట్నం బందరు పోర్టు త్వరలో ప్రజల వినియోగానికి అందుబాటులోకి రానుంది. రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా రవాణా, వాణిజ్య రంగాలకు ఈ పోర్టు కీలక భూమిక పోషించనుంది. ప్రస్తుతం ఎన్హెచ్-216 ఆరు వరుసల విస్తరణకు మార్గం సుగమమైపోయింది. దీనితోపాటు పోర్టు అనుసంధాన రహదారుల అభివృద్ధికి వేగం పెరిగింది. ముఖ్యంగా ఎన్హెచ్-65 (మచిలీపట్నం-విజయవాడ) మరియు ఎన్హెచ్-216 (కత్తిపూడి-ఒంగోలు) రహదారులను పోర్టుకు అనుసంధానించే పనులు త్వరితగతిన కొనసాగుతున్నాయి. ఈ మేరకు 127 ఎకరాల భూమి సేకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే జిల్లా మోర్త్ అధికారులు ఢిల్లీ వెళ్లి ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. త్వరలో భూసేకరణ ప్రక్రియకు 3ఏ నోటిఫికేషన్ విడుదల కానుంది.
పోర్టు మార్గంలో రద్దీ తగ్గించడానికి మచిలీపట్నం బైపాస్ వంతెన దగ్గర నాలుగు రింగులతో కూడలి (క్రాస్ క్లోవర్ లీఫ్) నిర్మించనున్నారు. ఇది పూర్తయిన తర్వాత పోర్టుకు వెళ్లే వాహనాలు రద్దీ రహితంగా రెండు రహదారుల ద్వారా ప్రయాణించగలవు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రవాణా సౌకర్యాలు మరింత మెరుగవుతాయి. మచిలీపట్నం పోర్టు వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తవుతుందని, అప్పటి నుంచి ఓడల రాకపోకలు కూడా ఊపందుకుంటాయని అధికారులు తెలిపారు.
ఈ కూడలి నిర్మాణానికి మూడు గ్రామాల పరిధిలో భూసేకరణ చేపట్టనున్నారు. ఇందులో ఎస్ఎన్ఎల్లపాలెంలో 94 ఎకరాలు, అరిసేపల్లిలో 27 ఎకరాలు, మాచవరం పరిధిలో 5 ఎకరాలు సేకరించనున్నారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు సర్వే నంబర్లు గుర్తించి మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ (మోర్త్)కు నివేదిక సమర్పించారు. మొత్తం భూసేకరణ ప్రక్రియకు దాదాపు రూ.600 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయబడింది.
216 జాతీయ రహదారి విస్తరణ, కూడలి నిర్మాణం పూర్తయితే తెలంగాణ రాష్ట్రానికి కూడా బందరు పోర్టు నేరుగా అనుసంధానమవుతుంది. భద్రాచలం, ఖమ్మం జిల్లాల నుంచి గ్రానైట్ ఉత్పత్తులు సులభంగా మచిలీపట్నం పోర్టుకు చేరుకోవచ్చు. అంతేకాకుండా అమరావతి ఓఆర్ఆర్ సమీపం నుంచే ఈ మార్గం గుండా వెళ్లడం వల్ల రాజధాని రాకపోకలకు కూడా సౌకర్యం ఏర్పడుతుంది.
నూజివీడు మామిడి, మల్లవల్లి పారిశ్రామికవాడలో తయారయ్యే ఉత్పత్తులను కూడా ఈ పోర్టు ద్వారా సులభంగా రవాణా చేయవచ్చు. తీర ప్రాంత రహదారి కావడంతో ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులకు మరింత ఊతం లభిస్తుంది. ఈ విధంగా వ్యవసాయ, పారిశ్రామిక, ఆక్వా రంగాలన్నీ అంతర్జాతీయ మార్కెట్లకు చేరుకోవడానికి మచిలీపట్నం పోర్టు కొత్త వేదికగా నిలుస్తుంది.
పోర్టు నిర్మాణం పూర్తవడమే కాకుండా రవాణా సౌకర్యాలు సిద్ధమైతే మచిలీపట్నం ప్రాంతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ప్రధాన కేంద్రంగా మారే అవకాశముంది. అంతర్జాతీయ వాణిజ్యానికి కొత్త మార్గాలు తెరుచుకోవడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మచిలీపట్నం పోర్టు ప్రాజెక్టు విజయవంతమైతే, ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు.