తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ మరో శుభవార్తను అందించింది. ప్రతిరోజూ దాదాపు 90 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించడానికి తిరుమల చేరుతుంటారు. అయితే వసతి సదుపాయాలు పరిమితంగా ఉండటంతో సగానికి పైగా భక్తులు కష్టాలు పడుతున్నారు. కొందరు యాత్రికుల వసతి గృహాలు, మఠాలు లేదా తాత్కాలిక గెస్ట్‌హౌస్‌లలో నిలవాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు టీటీడీ “వెంకటాద్రి నిలయం PAC-5” పేరుతో మరో కొత్త వసతి గృహాన్ని నిర్మించి భక్తుల సేవలోకి తీసుకురానుంది. ఈ వసతి గృహాన్ని రానున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 25న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
ఈ వెంకటాద్రి నిలయం నిర్మాణం 2018లో 102 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభమైంది. ఐదు అంతస్తుల్లో రెండు బ్లాక్‌లుగా నిర్మించిన ఈ భారీ వసతి సముదాయంలో ఒకేసారి 4 వేల మంది భక్తులు నివసించేలా సదుపాయాలు కల్పించారు. భక్తుల కోసం 16 డార్మెంటరీ హాల్స్, 216 మరుగుదొడ్లు, 216 స్నాన గదులు ఏర్పాటు చేశారు. అదనంగా, ప్రతి అంతస్తులో రెండు ఆర్వో ఫిల్టర్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి తాగునీటి అవసరాన్ని తీర్చనున్నారు. యాత్రికుల సామాను భద్రపరచేందుకు 2,500 లగేజీ లాకర్లు కూడా అందుబాటులో ఉంచారు.
వసతితో పాటు భోజన సదుపాయాలపైనా ప్రత్యేక శ్రద్ధ చూపింది టీటీడీ. ఒకేసారి 1,500 మంది భక్తులు భోజనం చేయగల రెండు విస్తారమైన డైనింగ్ హాల్స్‌ను నిర్మించింది. ఆధునిక సదుపాయాలతో పాటు పర్యావరణహిత చర్యలపై కూడా దృష్టి సారించారు. వేస్టేజ్ రీసైక్లింగ్ మెషిన్లను ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకు పరిశుభ్ర వాతావరణాన్ని అందించనుంది. తిరుమల RTC బస్టాండ్‌కు సమీపంలోనే ఈ నిలయాన్ని నిర్మించడం వలన భక్తులు సులభంగా చేరుకోవచ్చు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోత్సవానికి ముందుగానే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో, అదనపు ఈవోలు వెంకటాద్రి నిలయాన్ని పరిశీలించారు. బిల్డింగ్ మొత్తం తిరిగి చూసి ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించారు. అధికారుల నుండి నిర్మాణం, సదుపాయాలపై పూర్తి వివరాలు సేకరించారు. ఈ కొత్త వసతి గృహం అందుబాటులోకి రావడంతో తిరుమలకు వచ్చే వేలాది మంది యాత్రికుల వసతి సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయి.