అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతి వ్యాఖ్య సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. తాజాగా ఆయన రెండవ పదవీకాలంలో మొదటిసారి ఐక్యరాజ్యసమితి (UNGA) సమావేశంలో ప్రసంగించారు.
ఈ సమావేశం న్యూయార్క్‌లోని UN ప్రధాన కార్యాలయంలో జరిగింది. సాధారణంగా అధ్యక్షుడికి 15 నిమిషాల సమయం కేటాయిస్తారు. అయితే ట్రంప్ ఆ గడువు దాటి, దాదాపు 56 నిమిషాల పాటు మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రసంగాల్లో ఇది అత్యంత పొడవైనదిగా చరిత్రలో నిలిచిద్దని చెప్పుకోవాలి.
ప్రసంగం మొదలవగానే టెలిప్రాంప్టర్ పనిచేయకపోవడంతో ట్రంప్ చేతిలో ఉన్న నోట్స్‌ని ఆధారంగా చేసుకోవాల్సి వచ్చింది. ఆ సందర్భాన్ని హాస్యంగా మార్చి, టెలిప్రాంప్టర్ ఆపరేటర్ ఇప్పుడు పెద్ద కష్టాల్లో ఉంటాడేమ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, సమావేశానికి రాకముందు ఎస్కలేటర్ మధ్యలో ఆగిపోయిన ఘటనను కూడా తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ నవ్వులు పూయించారు.
ట్రంప్ రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై ఎక్కువ దృష్టి సారించారు. ఉక్రెయిన్ తన భూభాగాన్ని తిరిగి పొందగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే రష్యన్ జెట్‌లు NATO ఎయిర్‌స్పేస్‌లోకి ప్రవేశిస్తే వాటిని కూల్చేయాలని సూచించారు. ఈ వ్యాఖ్య యూరోపియన్ దేశాల్లో ఆందోళన కలిగించింది. భారత్, చైనా రష్యా యుద్ధానికి ప్రధాన ఫండర్లుగా ఉన్నారని ఆయన ఆరోపించారు.
అక్రమ వలసలు, వాతావరణ మార్పులు, మధ్యప్రాచ్య యుద్ధాలు వంటి అంశాలపై కూడా ట్రంప్ స్పందించారు. గాజా యుద్ధం తక్షణం ఆగాలని, బంధీలను విడుదల చేయాలని కోరారు. అయితే పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడాన్ని ఆయన తిరస్కరించారు.ప్రస్తుతం ట్రంప్ చేసిన ఈ ప్రసంగం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.