రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి పరిశ్రమల అభివృద్ధి అత్యంత కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లక్ష్యంతో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు తక్కువ ధరకే భూములను కేటాయించడం, లీజు రూపంలో ఇవ్వడం వంటి పలు ప్రోత్సాహకాలను అందిస్తోంది. అయితే, ఈ భూములు తీసుకున్నప్పటికీ పరిశ్రమలను అభివృద్ధి చేయడంలో జాప్యం చేస్తున్న కంపెనీలపై ఇక కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పరిశ్రమలు స్థాపించని సంస్థల వద్ద నుంచి భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టంచేసింది.
ఈ విషయాన్ని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అసెంబ్లీలో వెల్లడించారు. కొణతాల రామకృష్ణ, వేమిరెడ్డి ప్రశాంతి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఇప్పటి వరకు పరిశ్రమల కోసం భూములు తీసుకున్నా వినియోగించని అనేక సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని చెప్పారు. “ప్రభుత్వం నుంచి తీసుకున్న భూములపై పరిశ్రమలు వేయకపోతే ఇక భూములు తిరిగి స్వాధీనం చేసుకుంటాం. పారిశ్రామికాభివృద్ధి కోసం ఇచ్చిన సదుపాయాలను వాడుకోకుండా నిలిపివేయడం అసహనం” అని మంత్రి స్పష్టం చేశారు.
మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, గత 15 నెలల్లో NDA ప్రభుత్వం అత్యంత ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానాన్ని రూపొందించిందని, దానిపై పెట్టుబడిదారులు కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించారని చెప్పారు. రైలు, రోడ్లు, ఇతర అనుసంధానం లేని ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తే మరింత మద్దతు ఇవ్వనున్నామని ఆయన స్పష్టం చేశారు.
చంద్రబాబు నాయకత్వంలో గత 15 నెలల్లోనే పదివేల ఎకరాలకు పైగా భూములు పరిశ్రమల కోసం కేటాయించామని మంత్రి తెలిపారు. పోలిస్తే, గత ఐదేళ్లలో వైఎస్ జగన్ పాలనలో కేవలం ఎనిమిదివేల ఎకరాలే కేటాయించబడ్డాయని ఆయన గుర్తుచేశారు. “15 నెలల్లోనే ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం రాష్ట్రానికి గర్వకారణం. యువతకు హామీ ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమే” అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.