జామ పండును పేదవాడి యాపిల్ అని వైద్యులు పేర్కొంటారు. కారణం ఏమిటంటే, యాపిల్‌లో ఉన్న అనేక పోషకాలు జామ పండులో కూడా లభిస్తాయి. మన ఇళ్లలో సులభంగా లభించే ఈ పండు విటమిన్ సీ శాతం ఎక్కువగా కలిగి ఉంటుంది. అదేవిధంగా ఫైబర్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు కూడా జామలో అధికంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి మేలుకలిగించే పండుగా గుర్తింపు పొందింది.

బరువు తగ్గాలని కోరుకునే వారికి జామ పండు అద్భుతమైన ఎంపికగా వైద్యులు సూచిస్తున్నారు. ఈ పండు తినడం వలన ఆకలి నియంత్రణలోకి వస్తుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారు తరచుగా జామ పండు తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. అలాగే ఇందులో ఉండే కాపర్, ఇతర ఖనిజాలు హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడుతూ థైరాయిడ్ జీవక్రియలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.
జామ పండులో విటమిన్ A కూడా అధికంగా ఉంటుంది. దీని వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో కూడా జామ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అదనంగా ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, రక్తపోటుతో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తుంది. ఈ కారణాల వలన రోజువారీ ఆహారంలో జామ పండు చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే, జామ పండు ప్రతి ఒక్కరికీ అనుకూలం కాదు. జీర్ణ సమస్యలు, ఇరిగేటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS) ఉన్నవారు దీనిని తప్పుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కారణం, జామ పండులోని విత్తనాలు జీర్ణం కావడం కష్టతరం. ఇది కడుపు నొప్పి, అజీర్ణం, తిమ్మిరి వంటి సమస్యలకు దారితీస్తుంది. అలాగే మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు కూడా దీనికి దూరంగా ఉండటం మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అలాగే జలుబు లేదా దీర్ఘకాలిక సైనస్ సమస్యలతో బాధపడే వారు ముఖ్యంగా శీతాకాలంలో జామ పండును తీసుకోవడం నివారించాలి. ఎందుకంటే ఈ పండు శరీరానికి చల్లదనాన్ని పెంచే లక్షణం కలిగి ఉంటుంది. అందువల్ల జామ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగించినప్పటికీ, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా మాత్రమే దీన్ని తీసుకోవాలి.