భారత్–అమెరికా సంబంధాలు ఇప్పుడు మరింత వ్యూహాత్మకంగా మారుతున్నాయి. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, ఔషధ రంగం, ప్రత్యేక ఖనిజాలు వంటి కీలక అంశాలపై ఇరువైపులా చర్చలు జోరుగా సాగుతున్నాయి.
న్యూయార్క్‌లో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియోతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రుబియో మాట్లాడుతూ భారత్ అమెరికాకు అత్యంత కీలక భాగస్వామి అని భవిష్యత్తులో రెండు దేశాలు కలిసి పనిచేయాల్సిన రంగాలు విస్తారంగా ఉన్నాయి అని వివరించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా, ఓపెన్ వాతావరణాన్ని కొనసాగించేందుకు రెండు దేశాలు సమన్వయం చేసుకుంటాయని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా కొత్త రాయబారిగా నియమితుడైన సెర్జియో గోర్‌తో కూడా జైశంకర్ భేటీ అయ్యారు. మరోవైపు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, అమెరికా ప్రతినిధులతో ప్రత్యేక చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు ముందుకు సాగితే ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య త్వరలో భేటీ జరగొచ్చని దౌత్య వర్గాలు తెలిపాయి.
అక్టోబర్ 26 నుంచి 28 వరకు మలేషియా, కౌలాలంపూర్‌లో జరగనున్న ఆసియాన్, ఈస్ట్ ఏషియా సమ్మిట్‌లో మోదీ పాల్గొననున్నారు. అయితే ట్రంప్ కూడా హాజరైతే అక్కడే ద్వైపాక్షిక సమావేశం జరగవచ్చని ఇరు వర్గాలు వారు చెబుతున్నారు.
ఇక మరోవైపు యూరప్ యూనియన్‌తో కూడా భారత్ చర్చలు కొనసాగిస్తోంది. అమెరికా విధానాలు కొంత ప్రతికూలంగా మారుతున్నాయి అన్న అభిప్రాయం వ్యక్తమవుతుండగా, భారత్ యూరప్ వైపు దృష్టి మళ్లిస్తోందని విశ్లేషకులు తెలుపుతున్నారు. జైశంకర్ న్యూయార్క్‌లో యూరప్ విదేశాంగ మంత్రులతో సమావేశమై ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంక్షోభం, ఇంధన భద్రత, బహుపాక్షిక సహకారం వంటి అంశాలపై చర్చించారు.
ఇదిలా ఉంటే, అమెరికా ఇటీవల భారత్ దిగుమతులపై సుంకాలను 50 శాతం వరకు పెంచడం, H-1B వీసా ఫీజును $100,000కు పెంచడం వంటి నిర్ణయాలు సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ, సమస్యలను అధిగమించేందుకు ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కార మార్గం కనుగొనాలని నిర్ణయించుకున్నాయని దౌత్య వర్గాలు తెలిపాయి.