మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటనను అత్యవసర కారణాలతో రద్దు చేసుకున్నారు. నేపాల్‌లో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల కారణంగా అక్కడ చిక్కుకుపోయిన తెలుగువారిని సురక్షితంగా ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ ఆదేశాల నేపథ్యంలో నేడు అనంతపురంలో జరగాల్సిన "సూపర్ 6 సూపర్ హిట్" కార్యక్రమాన్ని రద్దు చేసి, మంత్రి నారా లోకేష్ తక్షణమే వెలగపూడి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్‌కు చేరుకుని పరిస్థితులను సమీక్షించనున్నారు.
ఉదయం 10 గంటలకు సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్‌లో ఈ సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ప్రత్యేక వార్ రూమ్‌ను ఏర్పాటు చేసి, వివిధ శాఖల మంత్రులు, అధికారులు పాల్గొని నేపాల్ పరిస్థితులపై సమన్వయం జరుపుతారు. అక్కడ చిక్కుకున్న వారిని సురక్షితంగా రప్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
అంతేకాకుండా సంబంధిత శాఖల అధికారులను తక్షణమే ఆర్టీజీఎస్ సెంటర్‌కు రావాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. దీనికి తోడు ప్రత్యేక కాల్ సెంటర్ మరియు వాట్సాప్ నంబర్‌ను ఏర్పాటు చేసి, ప్రజల నుంచి వివరాలను సేకరించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఈ విధంగా నేపాల్‌లో ఉన్న ప్రతి ఒక్కరిపై కచ్చితమైన సమాచారం సేకరించి, రక్షణ చర్యలు వేగవంతం చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో వెంటనే అవసరమైన చర్యలు తీసుకుని, చిక్కుకున్న వారిని రాష్ట్రానికి సురక్షితంగా తీసుకురావడమే మంత్రి లోకేష్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజకీయ షెడ్యూల్‌ను పక్కనబెట్టి, పూర్తిగా ప్రజల భద్రతపై దృష్టి పెట్టడం గమనార్హం. ఈ చర్యలు ప్రజలకు భరోసానిచ్చేలా, ప్రభుత్వ కర్తవ్యబద్ధతను ప్రతిబింబించేలా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.