
దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్సెస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) పరీక్షలు – 2025 త్వరలో ప్రారంభం కానున్నాయి. టైర్–1 రాత పరీక్షలు ఈ నెల సెప్టెంబర్ 12 నుంచి 26 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షల (CBT) రూపంలో నిర్వహించనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ప్రకటించింది. ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా, తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను కూడా ఎస్‌ఎస్‌సీ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సీజీఎల్ పరీక్షల విస్తృతి కూడా విపరీతంగా ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం 129 నగరాల్లో 260 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సారి మొత్తం 28,14,604 మంది అభ్యర్థులు టైర్–1 పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతి అభ్యర్థికి సులభం కావడానికి ఎస్‌ఎస్‌సీ ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు విడుదల చేసింది. వీటి ద్వారా పరీక్ష రాయాల్సిన నగరం వివరాలు తెలుసుకోవచ్చు.
గత జూన్‌లో ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 14,582 పోస్టులు భర్తీ కానున్నాయి. వీటిలో గ్రూప్–బి, గ్రూప్–సి విభాగాలకు చెందిన ఖాళీలు ఉన్నాయి. ఎంపిక ప్రక్రియలో టైర్–1, టైర్–2 పరీక్షలతో పాటు సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ టెస్ట్ తదితర దశలు ఉంటాయి. ఈ పరీక్షల ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, వివిధ సంస్థల్లో ఖాళీలు భర్తీ అవుతాయి. కాబట్టి ఈ పరీక్షలు అభ్యర్థుల కెరీర్‌లో కీలక పాత్ర పోషించనున్నాయి. అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేయకపోతే పరీక్ష కేంద్రంలో ప్రవేశం ఉండదని ఎస్‌ఎస్‌సీ స్పష్టం చేసింది.