ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులకు ముఖ్యమైన గమనిక. మార్చి 2026లో జరగనున్న ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ (IPE) ఫీజుల చెల్లింపుకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 10 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజులు చెల్లించుకోవచ్చని స్పష్టం చేసింది. గడువు దాటితే రూ.1000 జరిమానాతో అక్టోబర్ 21 వరకు మాత్రమే అవకాశం కల్పించనున్నట్లు విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు.
ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెగ్యులర్ విద్యార్థులు, ఫెయిల్ అయిన వారు, ప్రైవేట్ అభ్యర్థులు, గ్రూప్ మార్చిన వారు, హ్యూమానిటీస్‌లో ప్రైవేట్‌గా రాయబోయే విద్యార్థులు అందరూ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. థియరీ పేపర్‌కు రూ.600, ప్రాక్టికల్స్‌కు రూ.275, బ్రిడ్జి కోర్సు సబ్జెక్ట్‌కు రూ.165 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్ 21 తర్వాత ఫీజులు చెల్లించడానికి ఎలాంటి అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
ఈ సారి విద్యార్థులు సమయానికి ఫీజులు చెల్లించేందుకు కాలేజీ ప్రిన్సిపల్స్ కూడా బాధ్యత వహించాలని బోర్డు ఆదేశించింది. ఆలస్యమైతే జరిమానా భారంతో పాటు విద్యార్థులు పరీక్ష రాసే అవకాశం కోల్పోతారని హెచ్చరించింది. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు గడువులను తప్పకుండా పాటించాలని సూచించారు.
ఇదే సమయంలో రాష్ట్రానికి మరో గుడ్ న్యూస్. కేంద్ర కళలు, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీసీఆర్‌టీ శిక్షణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. అసోంలోని గౌహతిలో పది రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో దేశ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణపై చర్చలు జరగనున్నాయి. ఈ శిక్షణలో దేశవ్యాప్తంగా 68 మంది ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు.