ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లి రైతులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల ఉల్లికి సరైన ధర రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు. మార్కెట్‌లో కొనుగోలు దారులు ముందుకు రాకపోవటంతో కొంతమంది రైతులు తమ పంటను అక్కడికక్కడే వదిలేశారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతి క్వింటాకు రూ.1200 మద్దతు ధర చెల్లించాలని ఆదేశించారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి నుంచి రూ.10 కోట్లను అడ్వాన్స్‌గా మంజూరు చేసింది.
మార్కెట్‌లో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా ఉల్లిని కొనుగోలు చేయించనుంది. ఒకవేళ వ్యాపారులు రూ.1200 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తే, ఆ తేడాను ప్రభుత్వమే భరిస్తుంది. ఈ విధానం కర్నూలు మార్కెట్ యార్డులో ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
అయితే, కొత్త విధానంలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. వ్యాపారులు ఎప్పుడు కొనుగోలు చేస్తారనే విషయంలో స్పష్టత లేక రైతులు గంటల తరబడి మార్కెట్ యార్డులో వేచి ఉండాల్సి వస్తోంది. అంతేకాక, పంటను అమ్ముకున్న తర్వాత కూడా సరుకు మార్కెట్ దాటించేవరకూ రైతులే బాధ్యత వహించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం వేగంగా, సులభంగా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
మరోవైపు, రైతులకు ఇబ్బందులు రాకుండా కోల్డ్ స్టోరేజీలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే, మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన ఉల్లిని రైతు బజార్లకు తరలించాలనే ప్రణాళిక కూడా సిద్ధం చేస్తోంది. రైతులు నష్టపోకుండా, సమయానికి సరైన ధర అందేలా చూడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.