రాష్ట్రంలో వైద్య విద్యను మరింత అభివృద్ధి చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. వైద్య విద్యా అవకాశాలను విస్తరించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మొత్తం 10 కొత్త వైద్య కళాశాలలను పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) విధానంలో నిర్మించి, నిర్వహించాలని ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇప్పటికే సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది.
మొదటి దశలో ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందులలో కొత్తగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. వీటి కోసం టెండర్లు పిలిచి త్వరితగతిన అభివృద్ధి పనులు ప్రారంభించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. అనంతరం రెండో దశలో పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ప్రాంతాల్లోనూ వైద్య కళాశాలల నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ప్రాజెక్టులను పీపీపీ విధానంలో అమలు చేయడం వల్ల నిధుల సమీకరణ వేగవంతం అవుతుందని, ఫలితంగా కళాశాలలు నిర్ణీత కాలంలో పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానంతో వైద్య విద్యకు అవసరమైన మౌలిక వసతులు త్వరితగతిన లభిస్తాయని, ప్రజలకు ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
కేపీఎంజీ అడ్వయిజరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ కళాశాలలపై సమగ్ర అధ్యయన నివేదికను సమర్పించగా, దానిని ప్రత్యేక కమిటీ పరిశీలించింది. ఆ నివేదికల ఆధారంగా కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. తక్షణమే నిర్మాణానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని వైద్య సేవలు – మౌలిక సదుపాయాల సంస్థకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం రాష్ట్రంలో వైద్య విద్యను మరింత విస్తరించడమే కాకుండా, భవిష్యత్తులో ఆరోగ్య రంగ అభివృద్ధికి పెద్ద దోహదం చేస్తుందని స్పష్టమవుతోంది.